కొవిడ్ ప్రభావంతో ఆన్లైన్ బోధనకే పరిమితమైన రాష్ట్ర విద్యాసంస్థలు నేడు తెరుచుకోనున్నాయి. భిన్నమైన వాదనలు, అభిప్రాయాల మధ్య నేటి నుంచి ప్రత్యక్ష బోధనకు సర్కారు అనుమతించింది. కేజీ నుంచి పీజీ వరకు అన్ని విద్యా సంస్థల్లో ప్రత్యక్ష బోధన మాత్రమే ఉంటుందని.. ఆన్లైన్ పాఠాలు ఇక ఉండబోవన్న సర్కారు.. హైకోర్టు ఉత్తర్వులతో కొన్ని మార్పులు చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాలు నేటి నుంచి తెరుచుకోవడం లేదు. మిగతా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో నేడు బడి గంట మోగనుంది. ప్రైవేట్ పాఠశాలల్లో ఆన్లైన్లో బోధించాలా.. ప్రత్యక్ష బోధన ప్రారంభించాలా అనే నిర్ణయం యాజమాన్యాలే తీసుకోవచ్చునని విద్యా శాఖ తెలిపింది. పిల్లలను పంపించడంపై తల్లిదండ్రుల్లో భిన్న అభిప్రాయాలు ఉన్నందున.. ప్రైవేట్ యాజమాన్యాలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. కొన్నాళ్ల పాటు ఆన్లైన్లోనే బోధన కొనసాగిస్తామంటూ హైదరాబాద్లో పలు పాఠశాలలు.. ఎస్ఎంఎస్లు పంపించాయి. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలను ఇప్పటికే శుభ్రం చేసి సిద్ధంగా ఉంచారు.
కళాశాలల్లో ప్రత్యక్షబోధన మాత్రమే..
ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ కాలేజీలు కూడా నేడు ప్రారంభం కానున్నాయి. కాలేజీల్లో కేవలం ప్రత్యక్ష బోధన మాత్రమే ఉంటుందని అధికారులు తెలిపారు. హైకోర్టు ఉత్తర్వులు పాఠశాలలకు మాత్రమే వర్తిస్తాయని పేర్కొన్నారు. జూనియర్ కాలేజీల్లో ప్రత్యక్ష బోధన మాత్రమే ఉంటుందని.. విద్యార్థులు అవసరమైతే యూట్యూబ్ పాఠాలనూ వినవచ్చునని ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ తెలిపారు. యూనివర్సిటీల వీసీలతో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ఆచార్య లింబాద్రి ఆన్లైన్లో సమీక్ష నిర్వహించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రత్యక్ష బోధన నిర్వహించాలని కోరారు.
తాజా నిర్ణయాలివీ
- ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్లతో కూడిన సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ పాఠశాలలు తప్ప మిగతావి తెరచుకుంటాయి.
- ప్రత్యక్ష తరగతులకు విద్యార్థులు తప్పనిసరిగా హాజరుకావాలంటూ పాఠశాలల యాజమాన్యాలు బలవంతం చేయరాదు.
- ఆఫ్‌లైన్ బోధనా? ఆన్‌లైనా? లేదా రెండు విధానాలనూ అనుసరిస్తారా? అనేది ఆయా పాఠశాలల యాజమాన్యాలే నిర్ణయించుకోవచ్చు.
- తల్లిదండ్రుల నుంచి హామీ పత్రాలు తీసుకున్నా న్యాయపరంగా చెల్లవు. పిల్లలు కరోనా బారినపడితే విద్యాసంస్థల యాజమాన్యాలదే బాధ్యత.
- ప్రత్యక్ష తరగతులు నిర్వహించే పాఠశాలలు తగిన కొవిడ్ నియమ నిబంధనలు పాటించేలా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్(ఎస్‌వోపీ)ని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు వారంలోపు జారీ చేస్తారు.