తెలంగాణ

telangana

By

Published : Jan 31, 2021, 12:02 PM IST

ETV Bharat / state

మోగనున్న బడి గంట.. జాగ్రత్తలు తప్పనిసరి..!

మరి కొద్ది గంటల్లో బడి గంట మోగనుంది. పిల్లలతో.. పాఠశాలల్లో సందడి నెలకొననుంది. కొవిడ్‌ నేపథ్యంలో విద్యార్థులు లేక బోసిపోయిన విద్యాసంస్థలు మళ్లీ తెరుచుకోనున్నాయి. 9, 10 తరగతులు, ఆపై చదువుల వారే తరగతులకు హాజరుకావాలనే ప్రభుత్వ ఆదేశాల మేరకు.. జిల్లాలోని విద్యా సంస్థలు కసరత్తులు ప్రారంభించాయి. మహమ్మారి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ తరగతులు నిర్వహించడం.. ఇటు ఉపాధ్యాయులకు, అటు తల్లిదండ్రులకు కత్తిమీద సాములా మారింది.

schools-reopen-from-febraury-first-precautions-are-mandatory
మోగనున్న బడి గంట.. జాగ్రత్తలు తప్పనిసరి..!

కరోనా ప్రభావంతో దెబ్బతిన్న విద్యారంగాన్ని నిలబెట్టడానికి తెలంగాణ సర్కార్​ అన్ని చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రేపటినుంచి విద్యాసంస్థలు ప్రారంభం కానున్నాయి. ఆ మేరకు జిల్లాలో పది నెలలుగా మూతపడిన పాఠశాలలు, కళాశాలలు తెరుచుకొనున్నాయి. మహమ్మారి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ తరగతులు నిర్వహిస్తామని ఆయా సంస్థలు పేర్కొన్నాయి. నేరుగా తరగతులకు హాజరుకాలేని విద్యార్థులకూ హాల్ టికెట్లు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశాయి. తల్లిదండ్రుల అనుమతితోనే తరగతులకు రావాలని సూచిస్తున్నాయి.

భౌతికదూరమే శ్రీరామరక్ష..

ఒక్కో తరగతి గదిలో 20మందిని మాత్రమే కూర్చోపెట్టి క్లాసులు నిర్వహించనున్నట్లు విద్యా సంస్థలు తెలిపాయి. బెంచికి ఒకరు లేదా ఇద్దరిని.. భౌతిక దూరంలో ఉంచేలా చూస్తున్నట్లు పేర్కొన్నాయి.

మాస్క్‌లు, శానిటైజేషన్‌తో రక్షణ..

పాఠశాలలకు వచ్చే విద్యార్థులు, బోధన, ఇతర సిబ్బంది మాస్క్‌లు ధరించాలనే నిబంధనను కఠినంగా అమలుపరుస్తామని విద్యాసంస్థలు స్పష్టం చేశాయి. తరగతి గదులను ప్రతిరోజు శానిటైజ్‌ చేస్తామని హామీ ఇస్తున్నాయి.

ఐసోలేషన్‌ గదులు..

దగ్గు, జలుబు, తీవ్ర జ్వరం వంటి కొవిడ్‌ లక్షణాలున్న వారి కోసం ప్రత్యేక ఐసోలేషన్‌ గదులను ఏర్పాటు చేసినట్లు విద్యా సంస్థలు వివరించాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారికి థర్మల్ స్క్రీనింగ్ చేశాకే తరగతి గదిలోకి పంపనున్నట్లు వెల్లడించాయి.

సిలబస్​లో కోత...

ఈసారి పాఠ్యప్రణాళికను కుదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విద్యార్థులు ఆన్​లైన్ తరగతులను సరిగా వినకపోవడం, విన్నా అర్థం కాకపోవడం లాంటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని.. సిలబస్​ను కుదించే అవకాశాలున్నాయని అధ్యాపకులు అంటున్నారు. ఆ విషయంపై విద్యాశాఖ త్వరలోనే స్పష్టత ఇచ్చే అవకాశముందంటున్నారు.

విద్యార్థులను ఒత్తిడి చేయం..

పాఠశాల, కళాశాలలకు రాని విద్యార్థులను.. ప్రిన్సిపల్, అధ్యాపకులు ఒత్తిడి చేయరని ఇప్పటికే పలు విద్యా సంస్థలు స్పష్టం చేశాయి. ఆన్​లైన్​లో తరగతులు విని పరీక్షలు రాయవచ్చని వివరించాయి. నేరుగా తరగతులకు హాజరుకాని విద్యార్థులకూ హాల్ టికెట్లు ఇవ్వనున్నట్లు వెల్లడించాయి.

ఇదీ చదవండి:గురుకులాల్లో పీజీ కోర్సులు.. 2020-21 నుంచే ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details