సీఎం దళిత సాధికారత పథకాన్ని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దళిత మేధావులు, ప్రొఫెసర్లు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ప్రగతిభవన్‌లో పలువురు ముఖ్యమంత్రిని కలిశారు. ఎస్సీ-ఎస్టీ జాతీయ మేధావుల ఫోరం, మాదిగ మేధావుల ఫోరం, మాదిగ విద్యావంతుల వేదిక, ఓయూ నాన్ టీచింగ్ స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ తదితర దళిత సంఘాలకు చెందిన అధ్యక్ష, కార్యదర్శులు, మేధావులు కేసీఆర్‌ను కలిశారు. దళిత సాధికారత పథకాన్ని ప్రకటించినందుకు, మరియమ్మ లాకప్‌డెత్ విషయంలో తక్షణమే స్పందించి దళితుల ఆత్మస్థైర్యాన్ని పెంచినందుకు ధన్యవాదాలు తెలిపారు.
సీఎం ప్రవేశపెట్టిన దళిత సాధికారత పథకం.. దళితుల పాలిట వరమన్న మేధావులు.. దళితుల జీవితాల్లో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకనుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక భారాన్ని లెక్కచేయకుండా చిత్తశుద్ధి, ఉదార స్వభావంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అణగారిన తమ జాతి అభివృద్ధి కోసం కంకణం కట్టుకోవడం హర్షణీయమని ఎస్సీ-ఎస్టీ జాతీయ మేధావుల ఫోరం తెలంగాణ శాఖ నేతలు తెలిపారు. మరియమ్మ లాకప్‌డెత్ అంశంలో సీఎం కేసీఆర్ తక్షణమే స్పందించి వారి కుటుంబాన్ని నిలబెట్టడంతో పాటు చట్ట వ్యతిరేకంగా వ్యవహరించిన పోలీసుల విషయంలో తీసుకున్న నిర్ణయం గొప్ప విషయమని అన్నారు. కేసీఆర్ చర్యతో దళిత సమాజంలో ఒక భరోసా ఉప్పెనలా పొంగిందని వారు తెలిపారు.
లక్ష్య సాధనలో భాగస్వాములు కావాలి..
మేధావులను ఉద్దేశించి మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్.. రాష్ట్రంలో ఒక్కో రంగాన్ని చక్కదిద్దుకుంటూ వస్తున్నామని వివరించారు. ప్రభుత్వ చర్యలతో అందరి జీవితాలతో పాటు దళితుల జీవితాలూ మెరుగుపడుతూ వస్తున్నాయని.. అయినప్పటికీ దళితుల కోసం ఇంకా చేయాలని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. సామాజికంగా, ఆర్థికంగా శతాబ్దాలుగా వివక్షకు గురవుతోన్న దళిత సమాజం గురించి ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాగు చేసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.