తెలంగాణ

telangana

ETV Bharat / state

కేటీఆర్​తో సనోఫి ప్రతినిధుల భేటీ - it minister ktr

పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​ను ప్రముఖ ఫార్మా దిగ్గజ కంపెనీ సనోఫి అంతర్జాతీయ భాగస్వామ్యాల అధిపతి ఫ్యాబ్రిక్ జీయోప్రాయ్, అన్నపూర్ణదాస్ ఇండియా, సౌత్ ఏషియా జనరల్ మేనేజర్ కలిశారు. తెలంగాణలో తమ సంస్థ కార్యకలాపాలు, భవిష్యత్ ప్రణాళికలపై వారు మంత్రితో చర్చించారు.

sanofi delegates met with minister ktr
కేటీఆర్​తో సనోఫి ప్రతినిధుల భేటీ

By

Published : Mar 6, 2020, 5:12 AM IST

ప్రముఖ ఫార్మా దిగ్గజ కంపెనీ సనోఫి అంతర్జాతీయ భాగస్వామ్యాల అధిపతి ఫ్యాబ్రిక్ జీయోప్రాయ్, అన్నపూర్ణదాస్ ఇండియా, సౌత్ ఏషియా జనరల్ మేనేజర్.. పరిశ్రమలు,ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​తో ప్రగతిభవన్​లో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో శాంతా బయోటిక్ ఛైర్మన్ కే.ఐ. వరప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలో తమ సంస్థ కార్యకలాపాలు, భవిష్యత్ ప్రణాళికలపై వారు మంత్రితో చర్చించారు.

నూతన పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ప్రస్తుతం ఇక్కడే ఉండి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇలాంటి కంపెనీలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ అంతర్జాతీయ వ్యాక్సిన్ క్యాపిటల్​గా రూపాంతరం చెందిందని, ఇక్కడ వ్యాక్సిన్ తయారీకి, సంబంధిత రంగాల్లో అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయన్నారు.

హైదరాబాద్​లో ఉన్న ఫార్మా, లైఫ్ సైన్సెస్ ఈకో సిస్టమ్​ను మరింత బలపరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న కార్యాకలాపాలను మంత్రి కేటీఆర్ వివరించారు. ముఖ్యంగా భాగ్యనగరం లైఫ్ సైన్సెస్ రాజధానిగా ఉండటంతోపాటు ఇక్కడ అందుబాటులో ఉన్న సాంకేతికత, అద్భుతమైన మానవ వనరుల నేపథ్యంలో డిజిటల్ డ్రగ్ డిస్కవరీ వంటి వినూత్న రంగాల్లో అనేక అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

2021 సంవత్సరాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంవత్సరంగా ప్రకటించి వివిధ కార్యక్రమాలు చేపడుతుందని, ఇప్పటికే అనేక ఫార్మా దిగ్గజం కంపెనీలు తమతో కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భాగస్వాములు అయ్యేందుకు సుముఖత వ్యక్తం చేశాయని పేర్కొన్నారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వంతో సనోఫి కూడా కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో సనోఫి కార్యకలాపాల కోసం కావాల్సిన ఎలాంటి సహాయ సహకారాలైనా అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.

ఇవీ చూడండి:ప్రైవేటు ఆస్పత్రికి కరోనా సోకిన ఇటలీ పర్యటకులు

ABOUT THE AUTHOR

...view details