Sankranti Festival Passengers Problems :సంక్రాంతి పండుగ వేళపెద్ద సంఖ్యలో ప్రజలు సొంతూళ్లకు ప్రయాణమవుతున్న నేపథ్యంలో రైళ్లు, ఆర్టీసీ బస్సుల్లో తీవ్రమైన రద్దీ ఉంటుంది. రెగ్యులర్ రైళ్లలో 2-3 నెలల క్రితమే రిజర్వేషన్లు పూర్తయిపోగా, అరకొరగా ప్రకటించిన ప్రత్యేక రైళ్లలోనూ సీట్లు దొరకని పరిస్థితి ఉంది. హైదరాబాద్ నుంచి తెలంగాణ జిల్లాలకు, అదే విధంగా ఏపీలోని వివిధ ప్రాంతాలకు దక్షణ మధ్య రైల్వే గతంలో జన్ సాధారణ్ రైళ్లు నడిపించింది. ఏంటో గానీ ఈసారి వాటి జాడే లేదు.
Private Bus Travel Charges : ఏపీఎస్ ఆర్టీసీ(APSRTC) హైదరాబాద్ నుంచి నడిపే రోజు వారీ సర్వీసులకు అదనంగా 1,400 పై చిలుకు బస్సులు ప్రారంభించినా, ముందస్తుగానే రిజర్వేషన్లు అయిపోయాయి. టీఎస్‌ఆర్టీసీ(TSRTC) మహాలక్ష్మి పథకం దృష్ట్యా తెలంగాణ జిల్లాలకే ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. మరోవైపు ప్రైవేటు ఆపరేటర్లు మాత్రం ఇష్టారాజ్యంగా ఛార్జీలను పెంచేస్తున్నారు. ఈ నెల 12 నుంచి విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో 11వ తేదీ నుంచీ రద్దీ తీవ్రమవుతుంది.
Sankranti Travel in Telangana : హైదరాబాద్ నుంచి ఖమ్మంనకు 12వ తేదీన 69 ఆర్టీసీ బస్సులకు గానూ 4 బస్సుల్లో ఒక్కో సీటు మినహా రిజర్వేషన్లు పూర్తైపోయాయి. 13వ తేదీన 70 బస్సులకు గానూ 19 సీట్లు మాత్రమే ఉన్నాయి. భద్రాచలం, సూర్యాపేట, కరీంనగర్, కొత్తగూడెం, అశ్వారావుపేట తదితర ప్రాంతాలకూ పదుల సంఖ్యలో బస్సలు నడుపుతుండగా, దాదాపుగా రిజర్వేషన్లు అయిపోయాయి. దీంతో కుటుంబంతో సహా వెళ్లేవారికి టికెట్లు దొరకని పరిస్థితి నెలకొంది.
ఉచిత బస్సు ప్రయాణం వల్ల పెరిగిన రద్దీ - రేపు కొత్తగా 80 ఆర్టీసీ బస్సులు ప్రారంభం
గంటల వ్యవధిలోనే :హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు ఆర్టీసీ సంక్రాంతి ప్రత్యేక బస్సుల్లో గంటల వ్యవధిలోనే రిజర్వేషన్లు అయిపోతున్నాయి. విశాఖపట్నం, శ్రీకాకుళం, రాజాం, విజయనగరం, అమలాపురం, కాకినాడ, రాజమహేంద్రవరం, ఒంగోలు, విజయవాడ, గుంటూరు, నెల్లూరు వైపు బుకింగ్ ప్రారంభించిన మేరకు రిజర్వేషన్లు పూర్తయినట్లు ఏపీఎస్ఆర్టీసీ అధికారి ఒకరు తెలిపారు.
రైళ్లలో రిగ్రెట్!గోదావరి, విశాఖ, గౌతమి, గరీబ్‌రథ్, ఫలక్‌నుమా, ఈస్ట్‌కోస్ట్, ఎల్టీటీ-విశాఖ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో 12, 13 తేదీల్లో వెయిటింగ్ జాబితా కూడా దాటి రిగ్రెట్‌కు వచ్చింది. అధిక ఛార్జీలుండే సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్‌లో 12వ తేదీన 249, 13న 215 మంది వెయిటింగ్ లిస్ట్ టికెట్లు తీసుకున్నారు. తిరుపతి వైపు వందేభారత్, నారాయణాద్రి, శబరి, పద్మావతి, రాయలసీమ, వెంకటాద్రి తదితర రైళ్లలో స్లీపర్ తరగతుల్లో ఒక్కో రైల్లో మూడొందల వరకు వెయిటింగ్ లిస్ట్ ఉంది.
ప్రైవేటు బస్సుల్లో రూ.వేలల్లో వసూలు : హైదరాబాద్ నుంచి విశాఖపట్నం ఏపీఎస్ ఆర్టీసీ నైట్ రైడర్ బస్సులో స్లీపర్ ఛార్జి రూ.1,976 కాగా, ప్రైవేటు బస్సుల్లో గరిష్ఠంగా రూ.6,000 వరకు వసూలు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి రాజ మహేంద్రవరం ఏపీఎస్ ఆర్టీసీ స్లీపర్(వెన్నెల) బస్ టికెట్ ధర రూ.1,245 కాగా, ప్రైవేటు బస్సుల్లో రూ.3000 నుంచి రూ.4000 వరకు వసూలు చేస్తున్నారు. అలాగే హైదరాబాద్-బెంగళూరు మధ్య రాకపోకలకు గానూ రూ.4,300 నుంచి 4,700 దండుకుంటున్నారు. ఈ క్రమంలో రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు, బస్సుల సంఖ్య పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు. జన్ సాధారణ్ రైళ్లు నడిపితే రిజర్వేషన్ సమస్య లేకుండా అప్పటికప్పుడు స్టేషన్‌కు వెళ్లి నేరుగా రైలు ఎక్కొచ్చునని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వాటిల్లో ఛార్జీలు కూడా తక్కువగా ఉంటాయని అంటున్నారు.
సంక్రాంతి సందడి షురూ - నెలన్నర ముందే రైలు టికెట్ల బుకింగ్