Sankranti Celebrations : ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సంబురాలు అంబరాన్ని అంటుతున్నాయి. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో స్వర్ణ భారత్ ట్రస్ట్‌లో సంక్రాంతి సంబురాలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందుగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు 2023 సంవత్సరం, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా జీవితం కుటుంబ జీవితంలో ప్రతి ఒక్కరికీ క్రమ శిక్షణ అవసరం అన్నారు. మన పూర్వీకులు చూపించిన మార్గంలో నడవండి.. ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండండి.. సంస్కృతి సంప్రదాయాలను పాటించండి అని కోరారు. ఆటలు, పాటలు, గాలి పటాలు , రైతుల పండుగ, పశువులు, పెద్దలను పూజించే పండుగ సంతోషాలతో ఉండటమే సంక్రాంతి అని అన్నారు.
భాష, ఆచారాలు, సంస్కృతి సాంప్రదాయాల గురించి వెంకయ్యనాయుడు ఎప్పుడూ గుర్తు చేస్తుంటారని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు అన్నారు. స్వర్ణ భారత్‌కు వచ్చిన స్కూల్ విద్యార్థులు చక్కటి తెలుగులో మాట్లాడుతున్నారని అభినందించారు. స్వర్ణ భారత్ ట్రస్టు ఆదర్శాలకు, సాంప్రదాయాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని చెప్పారు.
మానవ సంబంధాలు, సమాజ సేవ వేదికగా స్వర్ణ భారత్ ట్రస్ట్ కొనసాగుతుందని, రాజకీయాలు ఇక్కడ మాట్లాడనని రాష్ట్ర మంత్రి కాకాణి అన్నారు. అనేక చోట్ల చూస్తే సంస్కృతి సంప్రదాయ ఉత్సవాలు ఉండటం లేదని అన్నారు. మానవ సంబంధాలు తగ్గాయని, ఇళ్లల్లో అందరూ టీవీల ముందు, సెల్ ఫోన్ల ముందు కూర్చుంటున్నారని తెలిపారు. వెంకయ్యనాయుడు మాత్రం ట్రస్ట్ ద్వారా సేవ చేస్తున్నారని అభినందించారు.