తెలంగాణ

telangana

ETV Bharat / state

నా అల్లుడిని చంపినవాళ్లను ఉరి తీయాలి: సంజన తల్లి - మచ్చి మార్కెట్ పరువు హత్య కేసు

honor killing in begum bazar
బేగంబజార్​లో పరువు హత్య

By

Published : May 21, 2022, 12:05 PM IST

Updated : May 21, 2022, 12:55 PM IST

12:01 May 21

నీరజ్​ను హత్య చేసిన వాళ్లను ఉరితీయాలి: సంజన తల్లి మధుబాయి

Honor Killing In Begum Bazar: హైదరాబాద్‌ నగరంలోని బేగంబజార్‌లో జరిగిన నీరజ్​ హత్యకేసులో అతని భార్య సంజన కుటుంబీకులపై వస్తున్న ఆరోపణల పట్ల.. ఆమె తల్లి మధుబాయి స్పందించారు. నీరజ్ హత్యతో తమ కుటుంబానికి ఎలాంటి ప్రమేయం లేదని వెల్లడించారు. హత్య సమయంలో తన కుమారుడు, బావ కుమారులు ఇంట్లోనే ఉన్నారని.. హత్యతో వాళ్లకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. హత్య విషయం తెలుసుకుని భయపడి ఇంట్లో నుంచి పారిపోయినట్లు తెలిపారు. తన కుమార్తె సంసారాన్ని నాశనం చేశారని.. తన అల్లుడిని హత్య చేసిన వాళ్లను ఉరితీయాలని డిమాండ్​ చేశారు. 6 నెలలుగా తన కూతురు, అల్లుడిని చంపుతామని ఎవరో బెదిరించారని.. వారెవరో తమకు తెలియదని వివరణ ఇచ్చారు.

నీరజ్​ హత్యోదంతంపై స్పందించిన సంజన సోదరి మమత.. హత్యతో తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ప్రేమ వివాహం ఇష్టం లేకనే.. ఏడాది పాటు సంజనతో మాట్లాడకుండా దూరంగా పెట్టినట్లు పేర్కొన్నారు. తన తల్లి ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఈ మధ్యనే ఆమెతో ఫోన్​లో మాట్లాడుతుందని.. తనతో 2 నెలలుగా మాట్లాడుతున్నట్లు తెలిపారు. భర్తతో కలిసి సంజన సంతోషంగా ఉండాలని కోరుకున్నామని.. ఇలా జరుగుతుందని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

బేగంబజార్‌ కూడలిలో మృతుడు నీరజ్‌ భార్య సంజన రెండు నెలల వయసున్న బాబుతో ధర్నాకు దిగారు. సంజన కుటుంబ సభ్యులు కూడా ఇందులో పాల్గొన్నారు. నిందితులను ఉరి తీయాలని వారు డిమాండ్‌ చేశారు. తన సోదరులే ఈ హత్య చేసినట్లు సంజన ఆరోపించారు. ఏడాదిగా తన సోదరులు బెదిరిస్తున్నట్లు ఆమె చెప్పారు. పీఎస్‌లో ఫిర్యాదు చేసినా తన సోదరులు వెనక్కి తగ్గలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించి పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. హత్య చేసిన వారిని గుర్తు పట్టేందుకు సంజనను పోలీసులు పీఎస్‌కు తీసుకెళ్లారు.

కాగా నీరజ్‌ హత్యకేసులో ఇప్పటికే ఐదుగురు నిందితులను గుర్తించగా.. నలుగురిని పట్టుకున్నట్లు హైదరాబాద్‌ పశ్చిమమండలం డీసీపీ జోయల్‌ డేవిస్‌ తెలిపారు. నిందితులందరూ సంజనకు దగ్గరి బంధువులని చెప్పారు. నిందితులను లోతుగా విచారిస్తున్నామని... ఈ కేసులో ఇంకెవరి ప్రమేయం ఉందా అనే కోణంలో విచారణ చేపట్టినట్లు వివరించారు.

బేగంబజార్‌ పరువు హత్యపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది. వివిధ పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో వచ్చిన కథనాలపై సుమోటోగా కేసు స్వీకరించింది. ఘటనపై జూన్ 30లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని హైదరాబాద్‌ సీపీకి ఆదేశాలు జారీ చేసింది.

Last Updated : May 21, 2022, 12:55 PM IST

ABOUT THE AUTHOR

...view details