తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రాణాలు పణంగా పెట్టి కరోనాను తరిమికొట్టే పనిలో.. - sanitation works to work hard for health state

తెల్లవారింది. పట్నం లేవలేదింకా. పల్లె కదలడం లేదింకా! వాళ్లు ఎప్పుడు లేచారో తెలియదు. బస్సుల్లో వస్తున్నారు. ఆటోల్లో నుంచి దిగుతున్నారు. వీధి వీధికీ వెళ్లిపోతున్నారు. సందులు, గొందుల్లోకి చొచ్చుకుపోతున్నారు. దృఢ సంకల్పంతో ముందుకు కదులుతున్నారు. సరిహద్దుల్లో వీర జవాన్ల మాదిరిగా.. పుర వీధుల్లో పౌరుషంగా నిలబడుతున్నారు. అడుగడుగునా ముప్పు పొంచి ఉన్నా.. తగు జాగ్రత్తలతో చెత్తపై ముప్పేట దాడికి దిగుతున్నారు. వారే పారిశుద్ధ్య కార్మికులు.

sanitation works to work hard for health state
ప్రాణాలు పణంగా పెట్టి కరోనాను తరిమికొట్టే పనిలో

By

Published : Apr 6, 2020, 6:47 PM IST

ప్రాణాలను పణంగా పెట్టి చీపురుతో కరోనాను తరిమికొట్టే ప్రయత్నం చేస్తున్నారు పారిశుద్ధ్య కార్మికులు. ఎవరు నిదురలేవకముందే తమ యుద్ధాన్ని ప్రారంభిస్తున్నారు. సూరీడు నిప్పులు కురిపించేదాకా నిత్యం సమరాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. వీళ్లలో మహిళలే ఎక్కువ. ఓపిక వీరికే ఎక్కువ. అందుకే అలుపెరగకుండా స్వచ్ఛ యజ్ఞాన్ని కొనసాగిస్తున్నారు.

చెత్తసేకరణ కార్మికుల కష్టాలు...

ప్రాణాలకు తెగించి కార్మికులు కష్టపడుతున్నారు. చెమట చిందించి పరిసరాలను అద్దంలా తీర్చిదిద్దుతున్నారు. వీరికి కృతజ్ఞతగానే ప్రధానమంత్రి పిలుపు మేరకు జనతా కర్ఫ్యూ నాడు సాయంత్రం 5 గంటలకు చప్పట్లు చరిచాం. కానీ, అసలు కర్తవ్యాన్ని మరిచాం. ఇంటిల్లిపాదీ ఇంట్లోనే పొగయ్యేసరికి చెత్త కూడా ఎక్కువగానే పుడుతోంది. తడి, పొడి చెత్తను వేరు చేయకుండానే బయట పెట్టేస్తున్నారు చాలామంది. దానిని వేరు చేయడం కార్మికులకు శాపమవుతోంది.

చేతులకు తొడుగులున్నా.. చెత్త వేరు చేయడానికి చేతులు రావడం లేదని బాధపడుతున్నారు వాళ్లు. ముక్కుకు అడ్డంగా మాస్కులున్నా.. భరించరాని కంపును ఆపలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా బారిన పడకుండా మనలను కాపాడుతున్న ఈ కార్మికులను అర్థం చేసుకుందాం. ఆహారం వృథా చేయడం మానేద్దాం. తడి, పొడి చెత్త వేరు చేద్దాం. చెత్త ఎత్తడానికి ఇంటి చెంతకు వచ్చిన ఆ అమ్మను నవ్వుతూ పలకరిద్దాం. చేతులు జోడించి నమస్కరిద్దాం. మనసారా కృతజ్ఞతలు ప్రకటిద్దాం!‘‘

ఆ తర్వాతే ఇంట్లోకి..

లాక్‌డౌన్‌ పకడ్బందీగా అమల్లో ఉన్నా.. రోడ్డెక్కుతున్న చెత్త తక్కువేం లేదు. దారులు ఖాళీగా ఉన్నా అనుకున్నంత సులువుగా వారి పని సాగడం లేదు. అడపాదడపా రయ్యిన దూసుకొచ్చే వాహనాలు కంగారు పెడుతున్నా.. చిత్తశుద్ధితో చెత్త ఏరిపారేస్తున్నారు కార్మికులు. దుర్గంధం ఒళ్లంతా పట్టుకున్నా.. ఇంటికి వెళ్లే దాకా వదలకున్నా.. తమ కర్తవ్యాన్ని అస్సలు విస్మరించడం లేదు. ‘ఏడ పనుందంటే ఆడికి పోతున్నం. కాయితం కూడా కనిపించొద్దంటున్నరు పెద్దసార్లు. పొద్దంతా ఊడుస్తునే ఉన్నం. పొద్దుగూకే వరకు ఇంటికి పోతున్నం. గరం నీళ్లతోని తానం చేసినంకనే ఇంట్ల అడుగు పెడుతున్న’మంటోంది కార్మికురాలు యాదమ్మ.

అందరూ అలాగే అనుకుంటే..

యాభై ఏళ్లు పైబడిన యాదమ్మను.. ఇంటిపట్టునే ఉండొచ్చు కదా అంటే.. ‘అట్ల అనుకుంటే ఎట్ల? డాక్టర్లూ గట్లనే అనుకుంటె ఎవరు చూడాలె. పోలీసోళ్లు బయటకు రామంటే అందరేం కావాలె?’ అని తిరుగు ప్రశ్నించింది. యాదమ్మే కాదు.. ఆమెతో పాటు పని చేస్తున్న సరోజనమ్మదీ అదే మాట. చంద్రవ్వదీ ఇదే బాట. ‘పొద్దంతా బయట తిరుగుతున్నవని మా పక్కింటామె అనుమానంగా చూసింది. మేం బైటకు పోకపోతే నీ ఇంటి ముందు చెత్త ఎవరు తీస్తరు? అని గట్టిగ తిట్టిన’ అని చెప్పుకొచ్చింది సరోజనమ్మ.

చాన మంది మిగిలిన అన్నం కవర్లలో చుట్టి బయట పెడుతున్రు. పెట్టే దిక్కులేక బయట కుక్కలకు ఎముకలు తేలుతున్నయ్‌. వాటికైనా పెట్టొచ్చు కదా! ఓ దిక్కు తిండి దొరక్క కొందరు ఏడుస్తాంటే.. ఈళ్లు అన్నం పడేస్తున్రు.’’

- లక్ష్మవ్వ


ఇవీ చూడండి:'దేశంలో తబ్లీగీ వల్లే రెట్టింపు కేసులు'

ABOUT THE AUTHOR

...view details