ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈ వేసవి కాలం నిప్పు రేగితే నీరేది? - అగ్ని ప్రమాదాలు

హైదరాబాద్​ గ్రేటర్‌ వ్యాప్తంగా తరచూ ఎక్కడోచోట అగ్నిప్రమాదాలు జరిగి ఆస్తి నష్టం జరుగుతోంది. అప్పుడప్పుడూ ప్రాణనష్టమూ వాటిల్లుతోంది. ప్రధాన ఘటనలప్పుడు అగ్నిమాపక శకటాల్లో ఉన్న నీరు సరిపోక వెతుక్కునే పరిస్థితి వస్తోంది. వేసవి అనగానే అగ్ని ప్రమాదాలే గుర్తుకొస్తాయి. ఏటా రాష్ట్ర వ్యాప్తంగా 7-8 వేలపైనే అగ్ని ప్రమాదాలు జరుగుతుండగా, వాటిలో నగరం చుట్టుపక్కలే ఎక్కువగా నమోదవుతున్నాయి. వాణిజ్య, వ్యాపార సంస్థలతోపాటు పరిశ్రమలు విస్తరించడం ఇందుకు ప్రధాన కారణం. నగరంలో చాలా ప్రాంతాల్లో అగ్నిమాపక శాఖకు నీరు లభించడంలేదు. జలమండలికి సమాచారం ఇచ్చి ట్యాంకర్లు వచ్చే వరకు వేచి చూడాల్సిన పరిస్థితి.

safety measures need in summer for fire accidents
నిప్పు రేగితే నీరేది?
author img

By

Published : Mar 21, 2021, 9:29 AM IST

జీహెచ్‌ఎంసీ పరిధిలో 30 అగ్నిమాపక కేంద్రాలున్నాయి. జంట నగరాల్లో 18 వరకు సేవలందిస్తున్నాయి. ప్రతి కేంద్రం వద్ద 25 వేల లీటర్ల సంపు తప్పనిసరిగా ఉండాలి. చాలా కేంద్రాల్లో స్థలాభావం వల్ల సంపులు ఉండడం లేదు.
*పంజాగుట్ట, లంగర్‌హౌస్‌, సనత్‌నగర్‌, సికింద్రాబాద్‌, మౌలాలి, ముషీరాబాద్‌, గౌలిగూడ, మొఘల్‌పురా, చందులాల్‌ బారాదరి, మలక్‌పేట, సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, సాలార్‌జంగ్‌ మ్యూజియం ప్రాంతాల్లో తరచూ నీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
*అగ్నిమాపక శకటంలో 4500-12000 లీటర్ల నీటిని నింపొచ్చు. పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు ఈ నీరు సరిపోదు. ఖాళీ అయ్యాక నింపడానికి సమీపంలో నీటి వసతులు లేక జలమండలి ట్యాంకర్లు తెప్పించుకోవాల్సి వస్తోంది. మెట్రో కారిడార్‌లో ప్రమాదాలు జరిగితే ఆనీరు వాడుతున్నారు.

అభివృద్ధి చెందిన దేశాల్లో ఇలా..

*అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతి 2-5 కి.మీ. పరిధిలో కీలక ప్రాంతాలను ఎంపిక చేసి ఫైర్‌ హైడ్రెంట్స్‌ అందుబాటులో ఉంచుతారు. నేరుగా నీటి పైపులైన్లలోనే ఇవి ఉంటాయి. నిప్పు రాజుకున్నప్పుడు ఈ గొట్టాల నుంచి నీటిని వాడతారు.
*నగరంలో రిజర్వాయర్ల మధ్య 1000 డయా, అంతకంటే ఎక్కువ పరిమాణంలో జలమండలి పైపులైన్లు ఉన్నాయి. తొలుత ప్రయోగాత్మకంగా, పది కీలక ప్రాంతాల్లో వీటికి ఫైర్‌ హైడ్రెంట్స్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించినా కార్యరూపం దాల్చలేదు. ప్రధాన పైపులైన్‌కు రంధ్రం పెట్టి ఓ ఛాంబర్‌ను నిర్మించి అక్కడ వాల్వ్‌ ఏర్పాటు చేసి, రెండువైపులా మూతలు బిగిస్తారు. అత్యవసర సమయాల్లో నీళ్లు తీసుకోవచ్చు. నేరుగా పైపు ఏర్పాటు చేసీ నీటిని తరలించవచ్చు.

ఇదీ చూడండి:యాదాద్రి ఆలయం.. విద్యుత్​ వెలుగుల శోభాయామానం

ABOUT THE AUTHOR

...view details