Gulf Jobs : సాధారణంగా గల్ఫ్‌లో విదేశీ కార్మికులకు పనిలో పెట్టుకోవాలనుకున్న సంస్థ అందుకు అక్కడి ప్రభుత్వం నుంచి అనుమతి పొంది వర్క్ పర్మిట్ (ఉపాధి) వీసా పంపించాలి. ఇందుకోసం ఆ సంస్థ కార్మికుడి పేరిట 750 దిర్హామ్‌లు/రూ. 1.5 లక్షలను డిపాజిట్ చేయాలి. నకిలీ ఏజెంట్లు కార్మికులను ఉపాధి వీసాపై కాకుండా పర్యాటక వీసాపై పంపి మోసగిస్తున్నారు. ఈ మతలబు తెలియని అమాయకులు అక్కడికి వెళ్లి చిక్కుల్లో పడుతున్నారు. కొంతమంది స్థానిక పోలీసులకు చిక్కి జైలు పాలవుతున్నారు. తరచూ అక్కడి ప్రభుత్వాలు వర్క్ పర్మిట్ వీసా లేని వారిని గుర్తించి తిరిగి స్వదేశాలకు పంపేస్తున్నాయి. 2019లో ఇలా 250 మందిని భారత్‌కు పంపించాయి. అధీకృత ఏజెంటు ద్వారా వీసా పొందేందుకు రూ. 34,500 లోపే వ్యయం అవుతున్నా.. అది తెలియక చాలామంది అమాయకులు నకిలీ ఏజెంట్లకు రూ. లక్షన్నర వరకు ముట్టజెప్పి మరీ అవస్థల పాలవుతున్నారు.
పీఓఐ అనుమతి ఉంటేనే రక్షణ..
అధీకృత ఏజెంట్ల నుంచే వీసా పొందాల్సి ఉన్నా చాలామంది అవగాహనలోపంతో నకిలీల వలలో చిక్కుతుంటారు. ఇలాంటి మోసాలకు విరుగుడుగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది. విదేశీ వలస కార్మికుల సంరక్షణ కార్యాలయం (ప్రొటెక్టర్ ఆఫ్ ఇమ్మిగ్రెంట్ -పీఓఐ) దీని పరిధిలోనే ఉంటుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్‌లోని ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయ ఆవరణలో ఇది ఉంది. ముఖ్యంగా గల్ఫ్ వెళ్లే వారిలో పదో తరగతి ఉత్తీర్ణతైనా లేనివారికి ఈ కార్యాలయం ఎంతో సహాయపడుతుంది. ముందుగా కార్మికులు ఈ కార్యాలయానికి వచ్చి ఇమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్ (ఈసీఆర్) క్లియరెన్స్ పొందాలి. ఆ సమయంలో సదరు కార్మికుడు ఎక్కడికి వెళ్తున్నారు? అక్కడి కంపెనీలో పని చేసేందుకు సరైన వీసా ఉందా? ఆ సంస్థ సరైనదేనా? వంటి పూర్తి వివరాల్ని ఇక్కడే తనిఖీ చేస్తారు. ఇక్కడే అన్నీ సరిచూసుకుని అధికారికంగా వెళ్తే అక్కడ ఏవైనా ఇబ్బందులు ఎదురైనా సులభంగా అధిగమించే వీలుంటుంది. అక్కడి భారత ఎంబసీ సహకారం లభిస్తుంది. అలాగే నామమాత్రపు రుసుంతో రూ. 10 లక్షల వరకు ప్రమాద బీమా, వైద్యచికిత్స బీమా, పింఛను సదుపాయం పొందే అవకాశాలు కలుగుతాయి.