నియంత్రిత పంటల సాగు విధానం అమలు, రైతుబంధు పథకాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రైతులంతా ప్రభుత్వం సూచన మేరకు నియంత్రిత సాగుకు అంగీకరించారని సీఎం కేసీఆర్ తెలిపారు. నియంత్రిత సాగు ప్రకారమే విత్తనాలు వేసుకోవడానికి సిద్ధం కావడం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు.
డిమాండ్ పంటలే వేయాలి...
డిమాండ్ ఉన్న పంటలనే వేసి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. రైతుల నుంచి వందకు వంద శాతం మద్దతు లభించిందన్నారు. రాష్ట్రమంతా రైతులు నియంత్రిత పద్ధతిలో పంటల సాగుకు సిద్ధమైనందన.. వెంటనే రైతులందరికీ రైతుంబంధు సాయం అందించాలని ఆదేశించారు. ఇప్పటికే వ్వయసాయ పనులు ప్రారంభమయ్యాయని.. ఏ రైతు పెట్టుబడి కోసం ఇబ్బంది పడకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఒక్క ఎకరా మిగలకుండా, ఒక్క రైతును వదలకుండా అందరికీ వారం, పది రోజుల్లోగా రైతుబంధు సాయాన్ని బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని స్పష్టం చేశారు.
యాసంగికీ ప్రణాళిక చేయండి
ప్రభుత్వం ఇచ్చిన పిలుపును అందుకుని నియంత్రిత పద్ధతిలో పంట సాగు చేయడానికి సిద్ధపడిన రైతులకు ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు. రైతుబంధు డబ్బులను ఉపయోగించుకుని, వ్యవసాయ పనులను ముమ్మరంగా కొనసాగించాలని రైతులను కోరారు. వర్షాకాలం పంటల కోసం ప్రణాళిక రూపొందించినట్లుగానే, యాసంగి పంటల కోసం కూడా వ్యవసాయ ప్రణాళిక తయారు చేయాలన్నారు.
ఇదీ చూడండి : 'ప్రేమ' వికటించింది.. పిల్లల్ని కన్నతల్లే నీటిలో తోసి చంపేసింది?