పార్టీ మారనని బాండ్ రాసిస్తేనే బీ ఫారం...! రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడంతో కాంగ్రెస్ పార్టీ గురువారం అభ్యర్థుల ఎంపిక పూర్తి చేస్తామని ప్రకటించింది. మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మంగళవారం రాత్రి గాంధీభవన్‌లో అత్యవసరంగా సమావేశమైన కాంగ్రెస్ సీనియర్ నేతలు...... రెండు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ కుంతియాతో పాటు 20 మందికిపైగా సీనియర్ నాయకులు సమావేశానికి హాజరయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, రిజర్వేషన్లు, అభ్యర్థుల ఎంపిక, మ్యానిఫెస్టో కమిటీ ఇచ్చిన నివేదిక, ప్రచారం, ఫిరాయింపులు తదితర అంశాలపై చర్చించారు. నిబంధనలు ఉల్లఘిస్తే క్రిమినల్ చర్యలే...
స్థానికంగా సమావేశాలు ఏర్పాటు చేసి అభ్యర్థుల ఎంపికపై చర్చించాలని పీసీసీ అధ్యక్షుడు సూచించారు. సెలక్ట్-ఎలక్ట్ పద్ధతిలో గెలుపునే ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేయాలన్నారు. పార్టీ వీడనని తెలియజేస్తూ... రూ.20 స్టాంపు పేపర్‌పై రాసివ్వాలని నిబంధన పెట్టనున్నట్లు సమాచారం. పార్టీ నిబంధనలను ఉల్లంఘిస్తే... క్రిమినల్ చర్యలు తీసుకోడానికి అవకాశం కల్పించేందుకు వీలుగా... అభ్యర్థుల నుంచి అఫిడవిట్ తీసుకోవాలని పార్టీ నిర్ణయించింది.
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు కొందరు నాయకులను ప్రచారతారలుగా నియమించనున్నారు.
ఇవీ చూడండి: మున్సిపాలిటీగా అవతరించిన నందికొండ కథేంటీ...!