వజ్ర బస్సులు అమ్మడానికి సిద్ధమైన ఆర్టీసీ ఆర్టీసీలో డిపోల వారీగా నష్టాలు వస్తున్న మార్గాలపై ఆ సంస్థ అధికారులు మేథోమథనం చేస్తున్నారు. ఏ ట్రిప్పుల్లో ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలో ప్రయాణిస్తున్నారు..? ఏ ట్రిప్పుల్లో తక్కువగా ఉంటున్నారు...? తదితర అంశాలపై అధికారులు డిపోల వారీగా అధ్యయనం చేస్తున్నారు. డిమాండ్ తక్కువగా ఉన్న మార్గాల్లో సర్వీసులను హేతుబద్దీకరణ చేసేందుకు అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టారు.
లాభాల్లో 11 డిపోలు
ఒకే సమయంలో రెండేసి బస్సులకంటే ఎక్కువ తిరిగితే వాటి సంఖ్య తగ్గించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. డిమాండ్ తక్కువగా ఉన్న మార్గాల్లో ట్రిప్పులు తగ్గించి.. ఎక్కువగా ఉన్న మార్గాల్లో ట్రిప్పులను పెంచాలని చూస్తున్నారు. 97 ఆర్టీసీ డిపోల్లో 11 డిపోలు మాత్రమే లాభాల్లో నడుస్తున్నాయి. మిగతా వాటి లాభాల్లోకి తీసుకొచ్చేందుకు 86 డిపోలకు ప్రత్యేక అధికారులను ఆర్టీసీ నియమించింది.
వజ్రతో నష్టమే
మరోపక్క వజ్ర బస్సులను అమ్మేందుకు ఆర్టీసీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. ఆ దిశగా ఉన్నతాధికారుల నుంచి డిపో మేనేజర్లకు మౌఖిక ఆదేశాలు వచ్చాయి. ప్రయాణికులను ఇంటి నుంచే ఎక్కించుకునే ఆలోచనతో మూడేళ్ల కిందట 66 వజ్ర మినీ బస్సులను ఆర్టీసీ కొనుగోలు చేసింది. ఒక్కో బస్సు సుమారు మూడు లక్షల కిలోమీటర్లు ప్రయాణించింది. వీటితో అయ్యే ఖర్చుకు.. ఆదాయానికి పొంతన లేకపోవడం వల్ల అవి ఆర్టీసీకి భారంగా మారాయి.
నష్టం వస్తే అమ్మేయండి
నష్టాలు వస్తున్న బస్సులను తొలగించాలని సమీక్షా సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు సూచించారు. లాభాలు రావు అనుకుంటే వజ్ర బస్సులను తీసేయండి అని సీఎం నుంచి అనుమతి లభించడం వల్ల ఆ దిశగా అధికారులు ఆలోచన చేస్తున్నారు. బస్సులను కొనుగోలు చేసినప్పుడు ఎలాంటి కండిషన్లో ఉన్నాయో.. అలాంటి కండిషన్లో ఉంచాలని వజ్ర బస్సుల డిపో మేనేజర్లకు మౌఖిక ఆదేశాలు వచ్చాయి. వాటికి మరమ్మతులు చేస్తున్నారు. వజ్ర బస్సుల అమ్మకాలు సంక్రాంతి తర్వాత చేస్తారా.. లేదంటే మేడారం జాతర తర్వాత చేస్తారా.. అనేది తేలలేదని డిపోమేనేజర్లు పేర్కొంటున్నారు.
ఇవీ చూడండి: విజయమే ధ్యేయంగా తెరాస వ్యూహాలు