తెలంగాణ

telangana

ETV Bharat / state

'అక్కరకు వస్తాయనుకుంటే... అసలే లేకుండా పోయింది' - tsrtc latest updates

అత్యవసర పరిస్థితుల్లో అక్కరకు వస్తాయని జీతంలో నుంచి కొంత మొత్తాన్ని ఆర్టీసీ ఉద్యోగులు సీసీఎస్ ఖాతాలో జమ చేసుకున్నారు. పిల్లల పెళ్లిళ్లు, చదువుల కోసం అవసరమైనప్పుడు వాడుకోవచ్చని అనుకున్నారు. కానీ తమ ఖాతా నుంచి మినహాయించుకున్న నిధులను యాజమాన్యం సొంతానికి వాడుకుంది. అవసరమైన సమయంలో ఆదుకోకుండా చేతులెత్తేసింది సీసీఎస్. తమ డబ్బులు తీసుకోలేక... బయట అప్పు పుట్టక కార్మికులు తల్లడిల్లిపోతున్నారు. ఆర్టీసీ కార్మికుల సీసీఎస్ కష్టాలపై ప్రత్యేక కథనం.

Rtc empolyees facing ccs problems in telangana
'అక్కరకు వస్తాయనుకుంటే... అసలే లేకుండా పోయింది'

By

Published : Jun 24, 2020, 7:55 PM IST

Updated : Jun 24, 2020, 11:55 PM IST

'అక్కరకు వస్తాయనుకుంటే... అసలే లేకుండా పోయింది'

ఆర్టీసీ కార్మికులకు జీతాలు తక్కువగా ఉండడం వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలోనే ఆర్టీసీ ఏర్పడిన తర్వాత ఉద్యోగుల పొదుపు, పరపతి సంఘం (సీసీఎస్)ను 1952లో ఏర్పాటు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 1.20 లక్షల ఆర్టీసీ కార్మికులు పొదుపు సంఘంలో సభ్యులుగా ఉన్నారు. ఆ తర్వాత టీఎస్ఆర్టీసీ ఏర్పడినప్పుడు 52వేల మంది కార్మికులు సీసీఎస్​లో పొదుపు చేస్తూ... వస్తున్నారు. ప్రతి నెల ఉద్యోగుల మూలవేతనం నుంచి ఆర్టీసీ యాజమాన్యం 7శాతాన్ని మినహాయించుకుని సీసీఎస్​కు చెల్లిస్తుంది. టీఎస్ఆర్టీసీలో 2020 నాటికి కొంతమంది కార్మికులు పదవీవిరమణ పొందగా... ఆ సంఖ్య 48వేల మందికి తగ్గిపోయింది.

2018 నుంచి ఆగిపోయిన నిధులు..

ప్రారంభంలో మెంబర్ షిప్ రిటైర్​మెంట్ డిపాజిట్ ఫండ్ కింద రూ. 1100 కోట్లు, ఫిక్స్​డ్ డిపాజిట్ కింద మరో రూ. 350 కోట్లతోపాటు మరికొన్ని నిధులు కలుపుకుంటే సీసీఎస్ వద్ద సుమారు రూ. 1500 కోట్ల నిధులు ఉన్నాయి. వీటి నుంచే ఉద్యోగులకు లోన్లు, మృతి చెందిన వారికి ఆర్థికసాయం, మెరిట్ స్కాలర్ షిప్​లు వంటివి అందజేస్తుంటారు. ఇందుకు గాను ప్రతినెలా ఆర్టీసీ ఉద్యోగుల వేతనాల నుంచి ఏడు శాతం మినహాయించిన రూ.40 కోట్లను ఆర్టీసీ యాజమాన్యం సీసీఎస్​కు చెలించాల్సి ఉంటుంది. కానీ 2018 సెప్టెంబర్ నుంచి ఈ నిధులు చెల్లించడంలేదు.

రూ. 40 కోట్లు నిలిపివేత..

ఆర్టీసీ యాజమాన్యం 2018 సెప్టెంబర్ నుంచి నెలనెలా సీసీఎస్​కు చెల్లించాల్సిన రూ. 40కోట్లు నిలిపివేసింది. ఆర్టీసీ సీసీఎస్​కు రూ. 632 కోట్ల అసలు, రూ. 102 కోట్ల వడ్డీ బాకీ ఉంది. పిల్లల పెళ్లిళ్లు, చదువుల కోసం, పదవీ విరమణ పొందిన వారు బెనిఫిట్స్ కోసం కాళ్ల చెప్పులరిగేలా సీసీఎస్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. కొందరు కార్మికుల పిల్లల పెళ్లిళ్లు ఆగిపోయాయి. మరి కొందరు పెళ్లిళ్ల కోసం దరఖాస్తు చేసుకోగా.. ఇప్పటికీ వారికి డబ్బులు అందలేదు. అప్పులు చేసి అవస్థలు పడుతున్నారు.

లోన్​ కోసం దరఖాస్తు..

48వేల ఉద్యోగుల్లో 12వేల మంది ఉద్యోగులు లోన్​ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీళ్లకు సీసీఎస్ నుంచి రూ.450 కోట్ల పైచిలుకు చెల్లించాల్సి ఉంది. ఫిక్స్​డ్ డిపాజిట్ పూర్తయిన వాళ్లకు రూ.70 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇందులో ఆగస్టు 2019 నుంచి దరఖాస్తు చేసుకున్నవాళ్ళు ఉన్నారు. పదవీ విరమణ చేసుకున్న వారికి సీసీఎస్ తరపున రూ. 50 కోట్లు చెల్లించాల్సి ఉంది.

మెంబర్​షిప్ రద్దు..

సీసీఎస్ నుంచి డబ్బుల చెల్లింపు జరగకపోవడం వల్ల విసుగు చెందిన సుమారు 3వేల మంది ఉద్యోగులు మెంబర్ షిప్ రద్దు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇదేవిధంగా అందరూ సభ్యత్వం నుంచి వైదొలిగితే సీసీఎస్ మరింత నష్టపోయే అవకాశముంది.

ఇవీ చూడండి:హైదరాబాద్​కు ఏదో అవుతుందనే విషపు ప్రచారం తగదు: మంత్రి ఈటల

Last Updated : Jun 24, 2020, 11:55 PM IST

ABOUT THE AUTHOR

...view details