రాజధానిలో పైవంతెనలు, రోడ్ల విస్తరణ, ఇతర అభివృద్ధి పనులపై నీలి నీడలు కమ్ముకున్నాయి. నిర్మాణ పనుల వరకు బ్యాంకు రుణాల ద్వారా సమీకరిస్తున్న నిధులు ఆదుకుంటున్నాయి. అయితే ఆయా ప్రాజెక్టుల ప్రారంభానికి ముందు చేపట్టాల్సిన ముఖ్యమైన ఆస్తులు, భూసేకరణ ప్రక్రియపైనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఓ అంచనా ప్రకారం వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం(ఎస్సార్డీపీ), చార్మినార్ పాదచారుల ప్రాజెక్టు(సీపీపీ), రోడ్ల విస్తరణ, ఇతర అభివృద్ధి పనులకు అవసరమైన ఆస్తులను సేకరించేందుకు రూ.608 కోట్లు కావాలి. మరో రూ.100 కోట్లు ఆయా ప్రాజెక్టులకు తదుపరి దశలో చేపట్టే భూసేకరణకు అవసరం కానుంది. ఉద్యోగులకు జీతాలే చెల్లించలేని ప్రస్తుత పరిస్థితుల్లో.. జీహెచ్‌ఎంసీ వందలాది కోట్లతో ఆస్తులు, భూసేకరణ పూర్తి చేయగలదా అనే ప్రశ్న తలెత్తుతోంది.
13 ఏళ్లుగా పూర్తవని సీపీపీ
చార్మినార్ పాదచారుల ప్రాజెక్టు 13 ఏళ్ల క్రితం మొదలైంది. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సాయం ద్వారా మొదలైన పనులను బల్దియా ఇంజినీర్లు ఇప్పటికీ పూర్తి చేయలేదు. రెండేళ్ల క్రితం చార్మినార్ పరిసరాలను గ్రానైట్ రాళ్లతో అలంకరించారు. చుట్టూ 100 మీటర్ల మేర నిర్మాణాలను తొలగించి పర్యాటకులకు సౌకర్యాలు కల్పించాలన్న ప్రతిపాదన దస్త్రాలకే పరిమితమైంది. దాంతోపాటు పరిసర ప్రాంతాలను అమృత్‌సర్ తరహాలో అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనలూ అటకెక్కాయి. వాటి కోసం భూసేకరణకు నిధులు అవసరమండంతో పనులు ఆపేశారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రాజెక్టుల వారీగా అవసరమైన నిధులు రూ. కోట్లలో
- ఎస్సార్డీపీ: 168
- సీపీపీ: 135
- రోడ్ల విస్తరణ: 130
- ఇతర: 175
- మొత్తం: 608