రాష్ట్రంలో రైతు వేదికల నిర్మాణం కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. 2020-21 సంవత్సరానికి సంబంధించి 350 కోట్ల రూపాయల విడుదలకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి డాక్టర్ బి.జనార్దన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణ 2,630 రైతు వేదికలు ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. రైతు వేదికల నిర్మాణ బాధ్యతలు మండల రైతుబంధు సమితులకు అప్పగించిన సర్కారు... అవగాహన సదస్సులు, చర్చలు నిర్వహించుకునేందుకు వీలుగా అందుబాటులోకి తీసుకురానుంది. రైతుబంధు సమితుల్లో 51 శాతం బలహీన వర్గాలు, మహిళలకు సర్కారు భాగస్వామ్యం కల్పించింది. రాష్ట్ర సమన్వయ సమితిలో గరిష్టంగా 15 మంది రైతు ప్రతినిధులకు అవకాశం కల్పించింది.
క్లస్టర్‌కు ఒకటి...
గ్రామీణ ప్రాంతాల్లో క్లస్టర్లు పరిధిలో రైతులంతా ఒక చోట చేరి సాగు విధానాలపై చర్చించుకోవడానికి వీలుగా రైతు వేదికలు నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. క్లస్టర్‌కు ఒక వేదిక చొప్పున నిర్మించేందుకు భూసేకరణ పూర్తి చేసింది. కొన్ని ప్రాంతాల్లో కొందరు ఉచితంగా భూమి కూడా అందజేసి తమలోని దాతృత్వాన్ని చాటుకున్నారు.