తెలంగాణలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి మరో రూ. లక్షా పదివేల కోట్లు అవసరమవుతాయి. అందులో 90 శాతానికి పైగా నిధులను 5 ప్రాజెక్టుల్లో ఖర్చు చేయాల్సి ఉంది. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ఎత్తిపోతల, దేవాదుల, డిండి ఎత్తిపోతల పథకాలకే రూ. 98 వేల కోట్లు వెచ్చించాల్సి ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి చేసిన కేటాయింపులను పరిగణనలోకి తీసుకుంటే ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి స్థాయిలో సిద్ధం కావడానికి కనీసం మూడు నుంచి నాలుగేళ్లు పట్టనుంది.
మూడింతల నిధులు...
ఐదింటిలో డిండి ఎత్తిపోతల మినహా మిగిలిన వాటికి బ్యాంకులు, కార్పొరేషన్ల నుంచి రుణాలున్నాయి. అయినప్పటికీ భూసేకరణ, ఇతర అవసరాలకు కూడా నిధులు అవసరం. డిండి ఎత్తిపోతల పథకానికి ఇప్పటివరకు చేసిన ఖర్చు పోనూ ఇంకా రూ. 4 వేల100 కోట్లు కావాలి.ఈ పథకానికి ఏదుల లేదా వట్టెం నుంచి నీటిని మళ్లించే పనులకు ఇంకా టెండర్లు పిలవలేదు. బడ్జెట్‌లో రూ. 545 కోట్లు కేటాయించారు. ఈ పథకాన్ని రెండు మూడేళ్లలో పూర్తి చేయాలన్నా ప్రసుత్తం చేసిన కేటాయింపులకు రెండు, మూడింతల నిధులు అవసరం.
మరో రూ. 45 వేల కోట్లు...
కాళేశ్వరం పూర్తి కావడానికి ఇప్పటివరకు ఉన్న అంచనా ప్రకారం మరో రూ. 45 వేల కోట్లు అవసరం. ప్రస్తుత బడ్జెట్‌లో రూ. 8 వేల కోట్లు కేటాయించారు. ఇందులో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణానికి వడ్డీ చెల్లింపులకు సుమారు రూ. 3న్నర వేల కోట్లు వెచ్చించాలి. వచ్చే ఏడాది తీసుకునే రుణాలకు 20 శాతం వాటా మార్జిన్ మనీ కింద ఖర్చు చేయాలి. దీంతో సంబంధం లేకుండా కేటాయించింది 918 కోట్లు మాత్రమే.
బడ్జెట్ నుంచి...