RRR Northern Part: ప్రతిష్ఠాత్మక ప్రాంతీయ రింగు రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్)లో ఉత్తర భాగం నిర్మాణానికి భూముల గుర్తింపు కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. 158 కిలోమీటర్ల ఈ భాగం.. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో 20 మండలాల్లోని 111 గ్రామాల మీదుగా వెళ్లేలా తాజాగా మార్గాన్ని ఖరారు చేశారు. మొత్తం 4,620 ఎకరాలు సేకరించాల్సి ఉంటుందనేది ప్రాథమిక అంచనా కాగా.. సంగారెడ్డి జిల్లాలో 1,250, మెదక్ జిల్లాలో 1,125 ఎకరాలు అవసరమని గుర్తించారు. సిద్దిపేట, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో ఎంత భూమి సేకరించాల్సి ఉంటుందనే అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెలాఖరు నాటికి విస్తీర్ణం ఖరారవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జిల్లాకో బృందం...
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పర్యవేక్షణలో పనిచేసేలా భూసేకరణకు ప్రత్యేకంగా జిల్లాకో బృందాన్ని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెలాఖరులోగా ఈ బృందాల నియామక కసరత్తు కొలిక్కి వస్తుందని ఉన్నతాధికారి ఒకరు మంగళవారం ‘ఈనాడు’తో చెప్పారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక భూసేకరణకు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేస్తుంది. అనంతరం ఆయా భూములను మార్కింగ్ చేసి, భూ యజమానులకు నోటీసుల జారీతో సేకరణ ప్రక్రియ చేపడతారు.