తెలంగాణ

telangana

ETV Bharat / state

అనారోగ్యంపాలైన వృద్ధుడు.. 15 కిలోమీటర్లు డోలీలోనే - విజయనగరం డోలీ ఘటన

గిరిజనులను డోలీ కష్టాలు వదలడం లేదు. ఆధునిక సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్నా... కొండపై గ్రామాలకు కనీస సౌకర్యాలు లేక గిరిపుత్రులు నానా అవస్థలు పడుతున్నారు. మెన్న గర్భిణి, నిన్న అనారోగ్యంపాలైన ఓ తల్లిని డోలీలోనే ఆస్పత్రికి తరలించారు. ఇవాళ ఓ వృద్ధుడుకి తీవ్రంగా కడుపునొప్పి వస్తే ఏకంగా 15 కిలోమీటర్లు డోలీలో మోసుకెళ్లే దయనీయమైన పరిస్థితి నెలకొంది.

doli problems in vizayanagaram

By

Published : Sep 25, 2019, 4:10 PM IST

అనారోగ్యంపాలైన వృద్ధుడు.. 15 కిలోమీటర్లు డోలీలోనే

ఆంధ్రప్రదేశ్​లోని విజయనగరం జిల్లాలో చాలా గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా.. ఆస్పత్రికి పోవాలంటే.. ఎన్నో అవస్థలు. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని సాలూరు మండలం సిరివర గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదు. గ్రామానికి చెందిన మెల్లక అలుసు అనే వ్యక్తికి వారం రోజులుగా కడుపు నొప్పి. స్థానికంగా వైద్యం అందించినా.. తగ్గకపోవటం వల్ల అతన్ని డోలీలో తీసుకువెళ్లారు. ఏకంగా 15 కిలోమీటర్లు డోలీలో మోసి.. ఆసుపత్రికి తరలించారు.

అక్కడి నుంచి మెరుగైన వైద్యంకోసం.. పార్వతీపురం ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకెళ్లమని రోగికి సూచించారు. 108 వాహనం అందుబాటులో లేక కుటుంబీకులు బాధితుల్ని బస్సులో పార్వతీపురం తీసుకొచ్చారు. బస్సు దిగాక బాధితుడిని.. అతని అల్లుడు మోసుకుంటూ ఆస్పత్రికి తీసుకెళ్లాడు.

2 వారాల క్రితం పార్వతి అనే మహిళ ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల డోలీలోనే ఆసుపత్రికి తరలించామని గ్రామస్థులు తెలిపారు. గర్భిణీలను కూడా డోలీలోనే తరలించాల్సి వస్తోందని అడవి బిడ్డలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించి తమ కష్టాలు గట్టెక్కించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

ఇవీ చూడండి:ఆరుబయట మలవిసర్జన చేశారని చిన్నారుల్ని కొట్టి చంపారు!

ABOUT THE AUTHOR

...view details