గతేడాది డెంగీ జ్వరాలు రాష్ట్రాన్ని వణికించిన నేపథ్యంలో సీజనల్ వ్యాధులను ఎదుర్కోవడంపై ఆరోగ్యశాఖ ప్రత్యేక ముందస్తు కార్యాచరణను సిద్ధం చేసింది. దీనిపై ఇప్పటికే ముఖ్యమంత్రి, పురపాలక మంత్రుల స్థాయుల్లో చర్చించగా, తాజాగా మంగళవారం వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు అదే అంశంపై సమీక్షించారు.
కరోనాకు పోటీగా డెంగీ, మలేరియా - సీజనల్ వ్యాధులతో ముప్పే
కరోనా విజృంభణకు తోడుగా.. మున్ముందు వర్షాకాలం ఆరంభమయ్యాక కాలానుగుణ(సీజనల్) వ్యాధుల ముప్పూ పొంచి ఉందని వైద్యఆరోగ్యశాఖ ఆందోళన చెందుతోంది. లాక్‌డౌన్ ఆంక్షలు సడలించిన నేపథ్యంలో కరోనా కేసులూ పెరిగే ప్రమాదం ఉందని అంచనా వేస్తోంది.
కొవిడ్.. డెంగీ.. మలేరియా...
ఎందుకు ఆందోళన?
- కరోనాతో పాటు స్వైన్‌ఫ్లూ, మలేరియా, డెంగీ, గన్యా, టైఫాయిడ్, కామెర్లు, డయేరియా వంటి దోమకాటు, కలుషిత నీటికారక వ్యాధులు తలెత్తే అవకాశాలున్నాయి.
- 2018లో డెంగీ కేసులు 6,362 నమోదు కాగా, గతేడాది 13,361 నిర్ధారించారు. ఈ ఏడాదిలో ఇప్పటికే 589 కేసులు నమోదయ్యాయి. వర్షాకాలం మొదలయ్యాక వీటి సంఖ్య మరింతగా పెరిగే ప్రమాదముంది.
- సాధారణ ఫ్లూ జ్వరాలు 2018లో 3.22 లక్షలు నమోదు కాగా, 2019లో 3.29 లక్షల మంది వైరల్ జ్వరాల బారినపడ్డారు. ఈ ఏడాదిలో తొలి నాలుగు నెలల్లోనే 68,126 మంది ఫ్లూ జ్వరాలతో చికిత్స పొందారు.
- వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నప్పుడు జలుబు, దగ్గు, జ్వరం వంటి ఫ్లూ లక్షణాలు కనిపించడం సాధారణమే. అయినా మున్ముందు ఈ లక్షణాలున్న కేసులు ఎక్కువగా నమోదైతే కరోనా భయమూ వెన్నాడుతుంది.
కార్యాచరణ ఇలా..
- సీజనల్ వ్యాధులను ఎదుర్కోవడంపై ఇప్పటికే ఆశా కార్యకర్తల నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకూ ఆరోగ్యశాఖ స్పష్టమైన ఆదేశాలిచ్చింది.
- గతేడాది డెంగీ, మలేరియా జ్వరాలు ఎక్కువ నమోదైన ప్రాంతాలను గుర్తించి, అక్కడ కట్టుదిట్టమైన నివారణ చర్యలను అమలుచేయాలి.
- ఎక్కడా మురుగునీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
- తాగునీరు కలుషితం కాకుండా సరఫరా పైపులైన్ల మరమ్మతుల విషయంలో పంచాయతీ, పురపాలక సిబ్బంది సమన్వయంతో పనిచేయాలి.
- మందులు, పరీక్ష కిట్లను సమకూర్చుకోవాలి.
- కరోనా లక్షణాలున్న రోగులనూ పరీక్షించాల్సి వస్తుంది కాబట్టి.. ముందస్తుగా పీపీఈ కిట్లను ధరించి చికిత్సలో పాల్గొనాలి.
- సీజనల్ వ్యాధుల నివారణ, కరోనా జాగ్రత్తలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలి.
- కేసుల సమాచారాన్ని ఎప్పటికప్పుడూ ఆన్‌లైన్‌లో పొందుపర్చాలి.
- ప్రైవేటు ఆసుపత్రుల నుంచీ కరోనా, సీజనల్ వ్యాధుల సమాచారాన్ని ఎప్పటికప్పుడూ ఆన్‌లైన్‌లో సేకరించాలి.