రాష్ట్రంలో ఇటీవల కాలంలో మద్యం విక్రయాలు మరింత పెరుగుతున్నాయి. రాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో ఆ ప్రభావం మరీ ఎక్కువగా కనిపిస్తోంది. ప్రధానంగా నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో మద్యం అమ్మకాలు అధికంగా జరుగుతున్నట్లు ఎక్సైజ్ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. జులై నెలలో గడిచిన 22 రోజుల్లోనే ఈ మూడు జిల్లాల్లో కలిపి రూ.199 కోట్ల విలువైన మద్యం అదనంగా అమ్ముడుపోయినట్లు ఆబ్కారీ శాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి.
లాక్డౌన్ ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మద్యం ధరలు పెరిగాయి. రాష్ట్రంలో 16 శాతం పెంచగా.. ఏపీలో రెట్టింపు చేశారు. ఫలితంగా సరిహద్దు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకల నుంచి పెద్ద ఎత్తున మద్యం ఆ రాష్ట్రంలోకి అక్రమంగా సరఫరా అవుతోంది. దీంతోపాటు కొన్ని బ్రాండ్లు ఏపీలో దొరకకపోవడం సైతం ఇందుకు మరో కారణంగా తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలోకి అక్రమ మద్యం సరఫరాను నిలువరించేందుకు ఏర్పాటైన ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (సెబ్) అధికారులు అక్రమార్కులపై ప్రత్యేక దృష్టి సారించారు. తెలంగాణ నుంచి ఏపీలోకి ప్రవేశించే ప్రతి వాహనాన్నీ తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో మహబూబ్‌నగర్ జిల్లా సరిహద్దుల నుంచి కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలకు, నల్గొండ జిల్లా నుంచి కృష్ణా, గుంటూరు జిల్లాలకు, ఖమ్మం జిల్లా నుంచి కృష్ణా జిల్లాకు భారీగా మద్యం తరలుతున్నట్లు గుర్తించారు. పట్టుబడిన అక్రమార్కుల నుంతి మద్యాన్ని స్వాధీనం చేసుకుని.. కేసులు నమోదు చేస్తున్నారు.
మొత్తం మీద తెలంగాణలో మద్యం అమ్మకాలు పెరిగి రాబడిని పెంచుతుంటే.. ఏపీలో మాత్రం అక్రమ మద్యం కారణంగా మద్యం విక్రయాలు తగ్గి ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది.
ఇదీచూడండి: నెక్లెస్ రోడ్డులో నీరా స్టాల్ నిర్మాణానికి శంకుస్థాపన