తెలంగాణ

telangana

ETV Bharat / state

Revanthreddy fires on CM KCR : 'ఖమ్మంలో జరగబోయే భారీ బహిరంగ సభ.. కేసీఆర్‌ సర్కార్‌ పతనానికి నాంది' - వేడెక్కిన తెలంగాణ రాజకీయం

Revanthreddy Comments at Ponguleti House : కేసీఆర్‌ కుటుంబం కోసం తెలంగాణ వనరులను కబ్జా చేశారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్‌ను గద్దె దించడంపై ఇవాళ్టి సమావేశంలో చర్చించామన్న ఆయన... పొంగులేటి బృందాన్ని కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానించామని తెలిపారు. దేశ ఎన్నికలకు ఖర్చు పెట్టే స్థాయికి సీఎం కేసీఆర్‌ చేరారన్న కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి... ఇంటికి కిలో బంగారం ఇచ్చినా రాష్ట్రంలో బీఆర్​ఎస్ గెలవని పరిస్థితి ఉందన్నారు.

Revanthreddy
Revanthreddy

By

Published : Jun 21, 2023, 5:47 PM IST

Updated : Jun 21, 2023, 6:39 PM IST

Revanthreddy Komatireddy Meets Ponguleti : జూబ్లీహిల్స్‌లోని మాజీ ఎంపీ పొంగులేటి నివాసానికి వెళ్లిన రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చిన్నారెడ్డి, మల్లు రవి తదితరులు పొంగులేటి, అతని మిత్రబృందం కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని ఆహ్వానించారు. పొంగులేటితో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన రేవంత్​రెడ్డి, కోమటిరెడ్డి... సీఎం కేసీఆర్​, బీఆర్​ఎస్ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.

Revanthreddy Comments at Ponguleti House : తెలంగాణ ప్రజల ఆశలను సీఎం కేసీఆర్‌ కాలరాశారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌ వ్యతిరేక రాజకీయ పునరేకీకరణ దిశగా పలువురు నేతలను కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. పొంగులేటితో పాటు ఇతర నేతల చేరిక, కలయిక తెలంగాణకు ఉజ్వల భవిష్యత్తును ఇస్తుందన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ప్రొ.జయశంకర్‌ పరితపించారన్న రేవంత్​రెడ్డి... తెలంగాణ జాతిపితగా జయశంకర్‌ను 4 కోట్ల మంది గౌరవించుకున్నారన్నారు. తొలిదశ, మలిదశ ఉద్యమంలో ఆయన క్రియాశీలపాత్ర పోషించారని, తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంతకర్తగా పేరుగాంచారన్న రేవంత్​... కానీ, ఆయన ఆశించిన ఫలితాలు రాలేదని పేర్కొన్నారు.

'కేసీఆర్‌ కుటుంబం కోసం తెలంగాణ వనరులను కబ్జా చేశారు. కేసీఆర్‌ కుటుంబానికి తప్ప ఇతరులకు ప్రయోజనం చేకూరలేదు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని విధ్వంసం చేశారు. రాజకీయ ప్రయోగశాలలో తెలంగాణను వేదికగా మార్చారు. కేసీఆర్‌ నుంచి తెలంగాణకు విముక్తి కల్పించాలని నిర్ణయం. కేసీఆర్‌ను గద్దె దించడంపై సమావేశంలో చర్చించాం. పొంగులేటి బృందాన్ని కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానించాం. తెలంగాణలో రాజకీయ పరిణామాలపై పార్టీ అధిష్ఠానంతో చర్చిస్తాం. త్వరలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీతో సమావేశమవుతాం. ఖమ్మంలో కనీవిని ఎరుగని రీతిలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం.'-రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

చేరిక, కలయిక తెలంగాణకు ఉజ్వల భవిష్యత్తును ఇస్తుందని రేవంత్​రెడ్డి అన్నారు. వ్యక్తులు ఎప్పుడూ వ్యవస్థ ముందు తలవంచక తప్పదన్న రేవంత్​... కృష్ణా పరివాహకం మొత్తం కాంగ్రెస్‌కు అండగా నిలిచేందుకు సిద్ధం ఉందని వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా పేర్కొన్న ఆయన... పొంగులేటి చేరికతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉపా చట్టాలను ప్రజాసంఘాల నేతలపై పెట్టి వేధిస్తున్నారని బీఆర్​ఎస్ ప్రభుత్వంపై రేవంత్​ ధ్వజమెత్తారు.

Komatireddy fires on CM KCR : ఈ సందర్భంగా మాట్లాడిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి... కేసీఆర్ తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని ఆరోపించారు. బంగారు తెలంగాణ పేరుతో దోపిడీ చేస్తున్నారన్న కోమటిరెడ్డి... కేసీఆర్‌ కుటుంబం మాత్రమే బంగారుమయమైందని విమర్శించారు. రాష్ట్రంలో వరికి సరైన గిట్టుబాటు ధర ఇవ్వట్లేదని మండిపడ్డారు. పొంగులేటిని కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానించామన్న వెంకట్​రెడ్డి... కాంగ్రెస్‌ పార్టీలో సముచిత స్థానం ఇస్తామని చెప్పామన్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్​కు సపోర్ట్ చేయండన్న ఆయన... ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నానన్నారు.

'నిరుద్యోగుల జీవితాలతో సీఎం కేసీఆర్ చెలగాటం ఆడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 70-80 స్థానాలు గెలుస్తుంది. దేశ ఎన్నికలకు ఖర్చు పెట్టే స్థాయికి కేసీఆర్‌ చేరారు. ఇంటికి కిలో బంగారం ఇచ్చినా బీఆర్​ఎస్ గెలవని పరిస్థితి. ధరణ వల్ల చాలామంది ఇబ్బంది పడ్తున్నారు. పొంగులేటి ఒక్కసారి ఎంపీ ఐనా లక్షలాది గుండెల్లో వున్నాడు. పార్టీలో పొంగులేటి వారి అనుచరులకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పాం. ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం. ఖమ్మం సభకు రూపాయి కూడా ఇవ్వం.. జనాలే వచ్చి విజయవంతం చేస్తారు. ఎన్నికల కోసమే బీసీలకు లక్ష రూపాయల పథకం తీసుకొచ్చారు.'-కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, భువనగిరి ఎంపీ

కాంగ్రెస్‌లోకి నేతలు చేరికలు ఆషామాషీ కాదన్న రేవంత్‌రెడ్డి

ఇవీ చదవండి :

Last Updated : Jun 21, 2023, 6:39 PM IST

ABOUT THE AUTHOR

...view details