సీఎం కేసీఆర్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కలిసి.. తెలంగాణ సమాజాన్ని చీల్చడానికి ప్రయత్నిస్తున్నారని ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెరాస, భాజపాలు కలిసి ఎంఐఎంను ఆటవస్తువుగా మార్చుకున్నాయని ఆయన విమర్శించారు. ఆ మూడు పార్టీలు ఒకే అజెండాతో పనిచేస్తున్నాయన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడానికి ఒకరికొకరు సాయం చేసుకుంటున్నారని ఆరోపించారు.
భాజపా, మజ్లిస్ పార్టీలది తెరముందు కుస్తీ, తెర వెనుక దోస్తీ అన్న చందంగా వారి స్నేహం ఉందని ఆరోపించారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా భాజపా అధికారంలోకి వచ్చేందుకు మజ్లిస్ సంపూర్ణ సహకారం అందిస్తోందని.. దీనికి తెరాస సమన్వయం చేస్తోందని ఆరోపించారు. బిహార్ ఎన్నికల్లో అదే జరిగిందన్నారు. ఎంపీ అసదుద్దీన్ జైలుకు వెళితే.. ఆయనకు బెయిల్ ఇప్పించింది భాజపా నేత రఘునందన్ రావు కాదా అని రేవంత్ ప్రశ్నించారు.