Revanth Reddy on Kaleshwaram Project: మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంతో ఆ తప్పును సీఎం కేసీఆర్ అధికారులపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. డిజైన్‌కు అనుగుణంగా మేడిగడ్డ నిర్మాణం జరగలేదని తెలిపారు. కాళేశ్వరం నిర్మాణానికి కర్త, కర్మ, క్రియ అన్నీ కేసీఆరేనన్న రేవంత్.. ఆయన ధనదాహానికి నిదర్శనం మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు అని విమర్శించారు. ఈ ప్రాజెక్ట్ విషయంలో తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
Revanth Reddy Fires on CM KCR : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న కాళేశ్వరం వివాదంపై సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈ ప్రాజెక్ట్ నిర్మించినప్పుడు.. 2014 నుంచి 2018 వరకు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా హరీశ్‌రావు ఉన్నారని గుర్తు చేశారు. 2018 నుంచి ఇవాళ్టి వరకు కేసీఆర్ సాగునీటి శాఖ బాధ్యతను చూస్తున్నారని చెప్పారు. 8 ఏళ్ల క్రితం విశ్రాంత అధికారికి ఈఎన్సీ బాధ్యతలు ఇచ్చారని.. అనంతరం తప్పుడు అంచనాలు వేయించారని ఆరోపించారు.
మేడిగడ్డ కుంగిపోవడం అంటే బ్యారేజీ మొత్తం కుంగిపోతుందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ నివేదిక ఇచ్చిందని తెలిపారు. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ 20 అంశాలకు సంబంధించిన వివరాలు అడిగితే.. 9 అంశాలపై నివేదిక ఇవ్వలేదని రేవంత్ అన్నారు. నిర్మాణంలో నాసిరకంతో పాటు అవినీతి జరిగిందని ప్రభుత్వానికి తెలుసని.. అందుకే ఆధారాలు తొక్కి పెడుతున్నారని ఆరోపించారు. ఈ బ్యారేజీని కూల్చి కొత్తగా నిర్మించాలని డిమాండ్ చేశారు.
"మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలపై వస్తున్న వార్తలపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత సీఎం కేసీఆర్‌పై ఉంది. ఎల్‌అండ్‌టీ సంస్థపై క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకునేందుకు కేసీఆర్ ఎందుకు ముందుకు రావడం లేదు. క్రిమినల్ కేసులు పెట్టడానికి కేసీఆర్ మీనమేషాలు లెక్కిస్తున్నారు. నిర్మాణ సంస్థ వైఫల్యం వల్లే మేడిగడ్డ కుంగిందని సీఎం ఎందుకు చెప్పడం లేదు." - రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు