Revanth Reddy Fires on CM KCR : రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుల అరెస్టులు అప్రజాస్వామికమనిటీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల పేరుతో కేసీఆర్ పార్టీ ప్రచారం చేసుకుంటూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుంది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఇది కచ్చితంగా దశాబ్ది దగానేనని స్పష్టం చేశారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఒక హామీనైనా పూర్తిగా అమలు చేశారా..? అంటూ ధ్వజమెత్తారు.
కేసీఆర్ ఇచ్చినవి అమలు చేయకుండా మోసం చేసిన హామీలనే ప్రశ్నిస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యలపై పోరాడే హక్కు తమకు ఉందని వెల్లడించారు. ముందస్తు అరెస్టులు చేసిన కాంగ్రెస్ నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసి తమ ఉద్యమాన్ని ఆపలేరని ఆయన విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని రేవంత్ రెడ్డి వాగ్దానం చేశారు.
'తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఈ ఉత్సవాలు కేవలం తన కుటుంబం కోసమే జరుపుతున్నట్టు ఉంది. తప్పును నిలదీస్తే తప్పుడు అరెస్టులు చేస్తారా..? రాష్ట్రంలో ఓ ప్రతిపక్ష పార్టీగా.. ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు మాకుంది. ఇవి దశాబ్ది ఉత్సవాలు కావు.. దశాబ్ది దగా' - రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్