Revanth Reddy fires on KTR : విమర్శలు ప్రతి విమర్శలతో తెలంగాణలో రాజకీయాలు మరింత వేడిక్కుతున్నాయి. తాజాగా ప్రియాంక గాంధీ హైదరాబాద్ పర్యటనపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే కేటీఆర్ వ్యాఖ్యలపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ కుమారుడి హోదాలో మంత్రి కేటీఆర్ సకల సౌకర్యాలు అనుభవిస్తున్నారని ఆరోపించారు. ఆయనకు తెలంగాణతో పేగు బంధం, పేరు బంధం లేదని ఆయన వ్యంగాస్త్రాలు సంధించారు.
అమర వీరుల కుంటుంబాలకు ప్రత్యేక గుర్తింపు పత్రాలు: బీజేపీ నేతలకు కేటీఆర్, కేసీఆర్ పరోక్షంగా సహకరిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రేపు హైదరాబాద్ సరూర్‌నగర్ వేదికగా జరగనున్న నిరుద్యోగ సభలో కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ ప్రకటించనున్నట్లు తెలిపారు. దీనిలో తొలి ప్రాధాన్యంగా తెలంగాణ అమరుల కుటుంబాలను ఆదుకునే చర్యలుంటాయని వివరించారు. తొలి, మలి దశ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన కుటుంబాలకు ప్రత్యేక గుర్తింపు పత్రం ఇవ్వనున్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు.
ప్రాణాలు కోల్పోయిన అమరుల కుటుంబాలకు ప్రతీ నెల రూ.25,000 పింఛన్, కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. బ్విశ్వాల్ కమిటీ ప్రకారం ఖాళీలున్న 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేయడంతో పాటు.. ఏటా జనవరి 1న ఉద్యోగాల క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం వచ్చే వరకు ప్రతీ నెల రూ.4,000 పింఛన్ అందిస్తామని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ కింద విద్యార్థులకు పూర్తి ఫీజుల చెల్లింపు చేస్తామని రేవంత్ రెడ్డి వివరించారు.