Revanth Reddy attended SIT investigation: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ కేసులో ఆరోపణలు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు ఇవాళ సిట్ విచారణకు హాజరయ్యారు. ఆయన దగ్గర ఉన్న వివరాలతో సిట్ అధికారుల ముందు వ్యక్తి గతంగా హాజరయ్యారు. విచారణ అనంతరం మాట్లాడిన రేవంత్‌రెడ్డి.. ప్రతిపక్షాలను ప్రభుత్వం ఇబ్బందిపెడుతోందని ఆరోపించారు. కేసీఆర్ సర్కార్ ప్రతిపక్షాల గొంతునొక్కుతోందని పేర్కొన్నారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై కూడా సిట్ చర్యలు తీసుకోవాలని సూచించారు. విచారణలో మంత్రి కేటీఆర్ వద్ద సంపూర్ణమైన సమాచారం ఉందని సిట్ అధికారి ఏఆర్ శ్రీనివాస్‌కు వివరించినట్లు పేర్కొన్నారు. నేరస్థులను విచారించకుండానే కేటీఆర్ పూర్తి సమాచారం చెప్పారని తెలిపారు. కేటీఆర్ నుంచి సమాచారం ఎందుకు సేకరించలేదని ప్రశ్నించారు.
"విద్యార్థులు, నిరుద్యోగుల పోరాటంతోనే తెలంగాణ వచ్చింది. టీఎస్‌పీఎస్‌సీ రాజకీయ పునరావాస కేంద్రంగా మారింది. ప్రశ్నపత్రాల లీకేజీకి పూర్తి బాధ్యత మంత్రి కేటీఆర్‌దే. జరిగిన నేరాన్ని ఇద్దరికే పరిమితం చేస్తున్నారు. కేటీఆర్ పీఏ తిరుపతి, రాజశేఖర్ రెడ్డికి భాగస్వామ్యం ఉంది. సిట్ ద్వారా నోటీసులిచ్చి మమ్మల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నా వద్ద ఉన్న సమాచారాన్ని సిట్ అధికారికి అందించాం. పేపర్ లీకేజీపై నేను, సంజయ్, కేటీఆర్ ముగ్గురం స్పందించాం. సిట్ నాకు, సంజయ్‌కు నోటీసులిచ్చి కేటీఆర్‌కు ఇవ్వలేదు. దర్యాప్తు పూర్తికాకుండా నేరం ఎలా జరిగిందో కేటీఆర్ వివరించారు. 30లక్షల తెలంగాణ యువత భవిష్యత్‌ను ఆంధ్రా వాళ్లే నిర్ణయిస్తున్నారు. తెలంగాణ వచ్చినా ఏపీ అధికారుల చేతిలోనే తాళాలు ఎందుకు ఉన్నాయి? అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుకు తెలంగాణ బిడ్డ దొరకలేదా.. తెలంగాణ బిడ్డల త్యాగాలను కేసీఆర్ అపహాస్యం చేశారు. రేపు, ఎల్లుండి ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగ నిరసన"- రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
సిట్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత: రేవంత్‌రెడ్డి విచారణకు ముందు సిట్ కార్యాలయం వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. విచారణలో భాగంగా హైదరాబాద్‌లోని హిమాయత్ నగర్‌లోని సిట్ కార్యాలయానికి వచ్చిన రేవంత్ రెడ్డిని పోలీసులు లిబర్టీ కూడలి వద్ద నిలిపి వేయడంతో కారు దిగి కార్యాలయానికి నడుచుకుంటూ వచ్చారు. రేవంత్ రెడ్డి వెంట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రావడంతో పరిసర ప్రాంతాల్లో కొద్దిసేపు ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. అంతకు ముందు రేవంత్ రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయరెడ్డి, పలువురు నాయకులు ఆందోళనకు దిగారు. రోడ్డు పై బైఠాయించడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.