పారిశుద్ధ్య కార్మికురాలికి అనూహ్య గౌరవం - గణతంత్ర వేడుకల పరేడ్‌కు కేంద్రం నుంచి ఆహ్వానం Republic Day Celebrations Invitation to GHMC Sanitation Worker :హాయిగా పాటలు పాడుతూ, వీధులన్నీ శుభ్రం చేస్తున్న ఈమె పేరు డేరంగుల నారాయణమ్మ. హైదరాబాద్ మాహానగర పాలక సంస్థలో 22 ఏళ్లుగా పారిశుద్ధ్య కార్మికురాలుగా పని చేస్తోంది. బంజారాహిల్స్‌లోని వేమిరెడ్డి ఎనక్లేవ్ ఏరియా నిత్యం పరిశుభ్రంగా ఉంటుందంటే కారణం నారాయణమ్మే. అక్కడ ఆమెను పలకరించని వారు ఉండరంటే అతిశ యోక్తి కాదు. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు నారాయణమ్మ పేరు తెలియని వారుండరు. ఆమె పాట వినబడకపోయినా, ఆమె చీపురు శబ్ధం రాకపోయినా ఏమైందంటూ ఆరా తీస్తుంటారు. అంతలా బంజారాహిల్స్ వాసులతో మమేకమైంది నారాయణమ్మ.
GHMC Sanitation Worker : ఖరీదైన ప్రాంతంలో పని చేస్తున్న నారాయణమ్మ నివసించేది ఫిల్మ్ నగర్‌లోని వినాయకనగర్ బస్తీ. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ నారాయణమ్మ సొంతూరు. భర్త మద్యానికి బానిసై, కాలేయ క్యాన్సర్‌తో చనిపోవటంతో ఇద్దరు పిల్లలను పెంచి పెద్ద చేసింది. పనిలోనే పరమాత్ముడు ఉన్నాడని నమ్మే నారాయణమ్మ, జమ్మికుంట మండలం శ్రీరాములపల్లిలోని నిత్యానంద రాజేశ్వరాచార్యుల వద్ద గురుబోధ తీసుకుంది. అప్పటి నుంచి ఆధ్యాత్మిక చింతనతో జీవిస్తూ, రోజూ ఉదయం 3 గంటలకు నిద్ర లేస్తుంది. అనుష్టానం, ధ్యానం చేసి బంజారాహిల్స్‌లో పనికి వెళ్తుంది.
కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం - వారంలోనే జీహెచ్ఎంసీకి కొత్త బాసులు!
వినాయకనగర్ బస్తీలో కూతురు ఇంట్లో నివసిస్తున్న నారాయణమ్మ, తనకు జరిగిన అన్యాయాన్ని ఈటీవీ-ఈటీవీ భారత్‌తో పంచుకుంది. గతంలో ప్రభుత్వం తనకు ఇచ్చిన భూమిని కొంతమంది బస్తీ లీడర్లు కబ్జా చేశారని ఆరోపించింది. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా తనకు న్యాయం జరగలేదని, 22 ఏళ్లుగా సొంతింటి కోసం ఎదురు చూస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేసింది. కొత్తగా వచ్చిన ప్రభుత్వం తనకు న్యాయం చేస్తుందని కొండంత ఆశలు పెట్టుకుంది.
'మా అమ్మది ఆ పని. ఆమె నేను కలిసి మూడు సంవత్సరాలు చేశాం. మూడు ఏళ్లు చేశాక తమ్ముడు అమ్మని తీసుకెళ్లాడు. అప్పటినుంచి నేను ఒక్కదాన్నే చేస్తున్నా. మేం ముందు బావులు, చెరువులు తొవ్వెవాళ్లం, ఇళ్లు పగులగొట్టడం, కట్టడం అలా అన్ని పనులు చేసేదాన్ని. తర్వాత కొన్నాళ్లకి ఇలా వచ్చాను.' -నారాయణమ్మ, పారిశుద్ధ్య కార్మికురాలు
పరిశుభ్రత అంటే ప్రజా సేవగా భావించే నారాయణమ్మ సేవలను ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ ఏడాది దిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొనేందుకు నారాయణమ్మ పేరును ప్రతిపాదించారు. ఆమె సేవలను మెచ్చిన కేంద్రం, జనవరి 26న గణతంత్ర వేడుకల పరేడ్‌కు నారాయణమ్మను ప్రత్యేకంగా ఆహ్వానించింది. గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు ఆతృతగా ఎదురుచూస్తోన్న నారాయణమ్మ, ఉన్నంత కాలం పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తూ ప్రజాసేవలో లీనమవుతానని చెబుతోంది.
ప్రభుత్వ శాఖల్లో కొనసాగుతోన్న ప్రక్షాళన - ఈసారి జీహెచ్ఎంసీ అధికారులపై బదిలీ వేటు