పదో తరగతి స్టడీ మెటీరియల్ను తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల్లో రూపొందించినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ మేరకు స్టడీ మెటీరియల్ను ఆమె విడుదల చేశారు. డిజిటల్ తరగతులతో అవగాహన పొందిన అంశాలను మరింత నేర్చుకునేందుకు ఉపయోగపడుతుందని వివరించారు. కార్పొరేట్ సంస్థల నోట్స్ కన్నా స్టడీమెటీరియల్ అద్భుతంగా ఉందని అధికారులను మంత్రి అభినందించారు. స్టడీ మెటీరియల్ ను www.scert.telangana.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందన్నారు.
సాంకేతిక పదాల బహుబాషా నిఘంటువును రూపొందించామని సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. గణితం, భౌతిక, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం సాంఘిక శాస్త్రాల్లోని సాంకేతిక పదాలను ఆంగ్లం, తెలుగు, హిందీ, కన్నడ, మరాఠీ, తమిళం బాషల్లో రూపొందించామని మంత్రి తెలిపారు. ప్రాథమిక పరిభాషపై ప్రావీణ్యం పొందడం, ప్రశ్నాపత్రాల్లో ఏకరూపతను పాటించడానికి, అనువాదంలో అస్పష్టతను నివారించడానికి ఈ నిఘంటువు దోహదపడుతుందని అన్నారు.