తెలంగాణ రాష్ట్రంలో భూములు, భవనాల రిజిస్ట్రేషన్లు క్రమంగా వేగం పుంజుకుంటున్నాయి. కొవిడ్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు సడలింపుతో గత నెల 11వ తేదీ నుంచి రాష్ట్రంలో ని 141 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. అధికారులు, ఉద్యోగులు మాస్క్‌లు, గ్లౌజులు ధరించి విధులకు హాజరవుతున్నారు. సామాజిక దూరం పాటించేట్లు చర్యలు తీసుకున్న అధికారులు మాస్కులు ధరించి శానిటైజర్లు వాడే వాళ్లనే కార్యాలయంలోకి అనుమతిస్తున్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే వారు.. మాస్క్ బదులు టవల్‌ను మూతికి అడ్డం కట్టుకుని అయినా రావాలని స్పష్టం చేస్తున్నారు.
స్లాట్ బుకింగ్‌ల ద్వారానే రిజిస్ట్రేషన్లు..
రాష్ట్రంలో స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్లకు అనూహ్య స్పందన వస్తోంది. గతంలోనే ఈ విధానం అందుబాటులోకి వచ్చినప్పటికీ... కొవిడ్ నేపథ్యంలో రద్దీని నిలువరించడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ విధానానికి అధిక ప్రాధాన్యత సంతరించుకుంది. రిజిస్ట్రేషన్‌ల కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వచ్చే వారు... ముందు ఆన్‌లైన్ ద్వారా స్లాట్‌లను బుక్ చేసుకుటుంన్నారు. ముందుగా స్లాట్ బుక్ చేసుకుంటే నిర్దేశించిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి టైమ్‌కి వచ్చి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి చేసుకుని వెళ్లుతున్నారు. దీంతో కార్యాలయాల వద్ద పడిగాపులు కాయాల్సిన అవసరం లేకుండా పోతోంది. గడిచిన 18 రోజుల్లో 79,876 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా... అందులో దాదాపు సగం 37,585 రిజిస్ట్రేషన్లు స్లాట్ బుకింగ్ ద్వారా అయ్యాయి. క్రమంగా స్లాట్ బుకింగ్ విధానానికి అలవాటు పడుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.