Reduced Crop Loans: ప్రస్తుత యాసంగి సీజన్‌లో పంటరుణాల పంపిణీ నెమ్మదిగా సాగుతోంది. ఈ ఏడాది పంపిణీ లక్ష్యం 53 వేల కోట్లు కాగా... ఇంకా 17 వేల కోట్ల దాకా రుణాలు ఇవ్వాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. వరి వద్దని ప్రభుత్వం చెప్పడంతో ఏ పంట వేయాలనేదానిపై ఇంతకాలం రైతులు అనిశ్చితిలో ఉండటంతో రుణాలకు రావడం లేదని బ్యాంకులు చెబుతున్నాయి. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా 31 లక్షల మంది పంటరుణాలు తీసుకోగా ఈ ఏడాది ఇప్పటికి వారిలో ఇంకా 15 లక్షల మంది పాత బాకీ కట్టి కొత్త రుణం తీసుకోలేదని అంచనా.అందుకే రుణాల కోసం బ్యాంకులకు రావడం లేదని బ్యాంకర్లు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు... రుణమాఫీ అవుతుందని భావించి కొందరు రైతులు పాత బాకీ కట్టడానికి, రెన్యూవల్‌కు ముందుకు రావడం లేదని బ్యాంకర్లు చెబుతున్నారు.
గడువులోగా కట్టకపోతే అధిక వడ్డీ భారం...
Reduced Crop Loans: పంట రుణం తీసుకున్న రైతు నిర్ణీత గడువులోగా కట్టకపోతే అధిక వడ్డీ భారం పడుతోంది. రుణాలపై కేంద్రం బ్యాంకులకు ఇచ్చే ప్రోత్సాహకాన్ని సైతం బ్యాంకులు రైతులపైనే వేస్తున్నాయి. గడువులోగా కట్టే రైతులతో పోలిస్తే కట్టనివారిపై 2 రెట్లు అదనంగా వడ్డీ వేస్తుండటం గమనార్హం. దీంతో లక్షలాది మంది రైతులు కట్టే వడ్డీ వందల కోట్లలో ఉంటోంది. గడువులోగా చెల్లిస్తే ఈ సొమ్మంతా రైతులకు మిగిలే అవకాశాలున్నా చాలా మంది వినియోగించుకోవడం లేదు. తెలంగాణలో పంట రుణాలు తీసుకున్న వారిలో సగానికిపైగా రైతులపై అదనపు వడ్డీ భారం పడుతోందని వ్యవసాయ శాఖ అంచనా.