తెలంగాణ

telangana

ETV Bharat / state

Minister Vemula: రాయలసీమ ఎత్తిపోతల అక్రమమని తేలిపోయింది: ప్రశాంత్‌రెడ్డి - రాయలసీమ ఎత్తిపోతల పథకంపై మంత్రి వేముల

రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు (rayalaseema lift irrigation project) అక్రమమని బోర్డు ఆదేశంతో తేలిపోయిందని మంత్రి వేముల ప్రశాంత్​ రెడ్డి (Minister Vemula) అన్నారు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు ఆపాలని కృష్ణా బోర్డు ఆదేశించిందని మంత్రి పేర్కొన్నారు.

vemula
minister vemula prasanth reddy

By

Published : Jun 24, 2021, 5:07 PM IST

Updated : Jun 24, 2021, 10:25 PM IST

కృష్ణా బోర్డు ఆదేశాలతోనైనా ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పనులను ఆపాలని తెలంగాణ రాష్ట్ర ఆర్అండ్ బీ, శాసనవ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. నీట ప్రాజెక్టులపై తెరాస చిత్తశుద్ధిని ప్రశ్నించే నైతిక హక్కు కాంగ్రెస్, భాజపాలకు లేదన్నారు. తెలంగాణకు అడుగడుగునా అన్యాయం చేసినా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇక్కడి ప్రజలకు దేవుడెలా అవుతారని ధ్వజమెత్తారు. ఏపీ సీఎం జగన్ తన వైఖరి మార్చుకోక పోతే.. తగిన రాజకీయ మూల్యం చెల్లించుకుంటారని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ధ్వజమెత్తారు.

గ్రీన్ ట్రైబ్యునల్ స్టే ఉన్నప్పటికీ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు కొనసాగిస్తోందని మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. పోతిరెడ్డి పాడు, రాయలసీమ లిఫ్ట్ పథకాలతో రోజూ 7.7 టీఎంసీల నీటి తరలింపునకు జగన్ కుట్ర పన్నారని ధ్వజమెత్తారు. ఏపీ చేపట్టిన అక్రమ ప్రాజెక్టులు పూర్తయితే హైదరాబాద్​కు మంచి నీరు.. నల్గొండ, మహబుబ్ నగర్, ఖమ్మం జిల్లాల సాగు నీటి ప్రయోజనాలు దెబ్బతింటాయని ఆందోళన వెలిబుచ్చారు. ఏపీ అక్రమ ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ ఫిబ్రవరి నెలలోనే అన్ని ఆధారాలతో కృష్ణా రివర్ బోర్డుకు లేఖ రాశారని.. దాని ఫలితంగానే ఏపీ అక్రమ ప్రాజెక్టులను ఆపమని కేఆర్ బీఎం ఆదేశించిందన్నారు. తనను విమర్శించిన ఏపీ నేతలకు కృష్ణా బోర్డు ఆదేశం కనువిప్పు కలిగించాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వం మే 2020 లోనే పోతిరెడ్డి పాడు విస్తరణకు, రాయల సీమ లిఫ్ట్ పథకానికి జీవో ఇచ్చినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం స్పందించ లేదని కాంగ్రెస్, భాజపా నేతలు విమర్శించడం హాస్యాస్పదమని ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం జీవో ఇచ్చిన వారం రోజుల్లోనే రాష్ట్రప్రభుత్వం కృష్ణా రివర్ బోర్డు కు లేఖ రాసిందని... దిల్లీ లో ఎన్ని వేదికలున్నాయో అన్నింటికీ ఫిర్యాదు చేసినట్లు వివరించారు.

మీరెందుకు మాట్లాడడం లేదు..

కాంగ్రెస్, భాజపా నేతలకు తమ చిత్తశుద్ధిపై మాట్లాడే నైతిక హక్కు లేదని మంత్రి ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. పోతిరెడ్డి పాడు విస్తరణ కాంగ్రెస్ నాయకుల పాపమేనని దుయ్యబట్టారు. వైఎస్ హయాంలో పోతిరెడ్డిపాడు సామర్ధ్యం 11 వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెరగడం తెలంగాణ కాంగ్రెస్ నేతల అసమర్థత కాదా అని ప్రశ్నించారు. పోతిరెడ్డి పాడు నీళ్ల తరలింపునకు అప్పటి మంత్రి డీకే అరుణ హారతులు పట్టారని.. ఇరిగేషన్ మంత్రిగా పొన్నాల స్వాగతించారన్నారు. తెరాస మంత్రులు మాత్రం పోతిరెడ్డి పాడును వ్యతిరేకిస్తూ వై ఎస్ మంత్రివర్గం నుంచి బయటకు వచ్చారని గుర్తు చేశారు. భాజపా నేతలకు ఏపీ అక్రమ ప్రాజెక్టులు ఆపే భాద్యత లేదా అని మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. ఏపీ భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు అక్కడి ప్రాజెక్టులకు మద్దతుగా మాట్లాడుతుంటే.. తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్​కు బాధ్యత లేదా అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిష్క్రియా పరత్వాన్ని భాజపా ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు.

ఆ మాటలకు కట్టుబడి ఉన్నా..

వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని మంత్రి ప్రశాంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. తెరాస పొత్తు పుణ్యంతోనే 2004 లో వైఎస్ సీఎం అయ్యారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును గట్టిగా వ్యతిరేకరించిన వైఎస్... ఈ ప్రాంతానికి దేవుడు ఎలా అవుతారని ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణకు వైఎస్ ప్రత్యేకంగా చేసిందేమీ లేదన్నారు. కేసీఆర్ లా వైఎస్ ధాన్యం కొనుగోలు చేయించారా.. రైతుల అకౌంట్లలో రైతుబంధు వేయించారా అన్నారు. తెలంగాణకు పనికిరాని ప్రాజెక్టులను ప్రతిపాదించి ఏపీకి పనికొచ్చే ప్రాజెక్టులను తొందరగా పూర్తయ్యేలా చేశారని ధ్వజమెత్తారు. ఉద్యమకారుడిని కాబట్టి వైఎస్ హయాంలో తెలంగాణకు జరిగిన అన్యాయంపై భావోద్వేగం ఉందన్నారు. తనను బచ్చా అంటున్న డీకే అరుణలా.. సమైక్య పాలకుల మోచేయి నీళ్లు తాగలేదని వ్యాఖ్యానించారు. ఏపీ అక్రమ ప్రాజెక్టుల పై తెలంగాణ రాజకీయ సమాజం ఒక్కటి కావాలని కోరారు.

నీటి దోపిడికి పాల్పడుతున్న జగన్ గజదొంగేనని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ఆరోపించారు. నెలల తరబడి జైళ్లో ఉన్న వారిని గజదొంగ అనక పోతే ఇంకేమంటారన్నారు. కృష్ణా నీళ్లకు హుజూరాబాద్ ఉప ఎన్నికకు ముడిపెట్టడం హాస్యాస్పదమన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతోందని.. జగన్ భాజపా ట్రాప్​లో పడొద్దన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణ పాలిట రాక్షసుడని నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి దుయ్యబట్టారు. వైఎస్ గొర్లు తింటే.. జగన్ బర్లు తినేలా మారారని ధ్వజమెత్తారు. కృష్ణా జలాల కోసం రాజీనామా లకు సైతం తాము సిద్ధంగా ఉన్నామన్నారు. సింహం లాంటి కేసీఆర్ తో ఆటలాడుకోవడం జగన్ కు మంచిది కాదన్నారు. తెలంగాణ సస్య శ్యామలం కావడం ఇష్టం లేకే జగన్ అక్రమ ప్రాజెక్టులు మొదలు పెట్టారని ఆరోపించారు. కేసీఆర్ స్నేహ హస్తం ఇస్తే జగన్ ద్రోహ హస్తం ఇచ్చారని మండిపడ్డారు.

ఏపీ అక్రమ ప్రాజెక్టులు ఆపేందుకు తెలంగాణ సమాజం ఏకం కావాలని నేతలు కోరారు. తెలంగాణ ప్రయోజనాల కోసం అవసరమైతే కేసీఆర్ మరోసారి ఉద్యమకారుడిగా అవతరిస్తారన్నారు.

రాయలసీమ ఎత్తిపోతల అక్రమమని తేలిపోయింది: ప్రశాంత్‌రెడ్డి

అక్రమమైన, ఘోరమైన నీటి తరలింపును ఏపీ సీఎం జగన్​మోహన్​ రెడ్డి చేస్తున్నారు. రాయలసీమ ఎత్తిపోతలకు పనులు చేయట్లేదని... సర్వే కోసమే అక్కడ ఉన్నామని గ్రీన్​ట్రైబ్యునల్​కు అబద్ధం చెబుతున్నారు. రాయలసీమ ఎత్తిపోతల విషయంలో ఏపీకి చెందిన చాలా మంది నాయకులు అడ్డగోలుగా మాట్లాడారు. మరి ఇప్పుడేమంటారు..? రాయలసీమ ఎత్తిపోతల పథకం అక్రమమనే కదా... కృష్ణాబోర్డు ప్రాజెక్టును ఆపమని చెప్పినట్టే కదా.. సక్రమమైనదైతే కృష్ణాబోర్డు ఎందుకు ఆపమని చెబుతుంది..? మీకు అన్ని అనుమతులు ఉంటే డీపీఆర్​ను అందించమని ఎందుకు అడుగుతుంది...? విచిత్రం ఏమిటంటే ఈ విషయం మీద కాంగ్రెస్​ నాయకులు మాట్లాడడం విడ్డూరంగా ఉంది. పోతిరెడ్డిపాడు విస్తరణ పనులు ప్రారంభమైందే కాంగ్రెస్​ హయాంలోనే. ఈ ప్రాజెక్టుల విషయంపై కాంగ్రెస్​ నాయకులు కోర్టులో కేసులు ఎందుకు వేయడం లేదు. తెలంగాణకు అన్యాయం జరుగుతోందని పార్టీ తరఫున ఎందుకు స్పందించడం లేదు. తెలంగాణకు పనికొచ్చే మల్లన్నసాగర్​ ప్రాజెక్టు మీద మాత్రం 300 కేసులు వేశారు. కేంద్రం ఇచ్చిన ఆదేశాలు పాటించకుండా ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు. -వేముల ప్రశాంత్​ రెడ్డి, రాష్ట్ర మంత్రి.

ఇదీ చూడండి:Ys Sharmila: ఉమ్మడి కరీంనగర్​లో వైఎస్​ షర్మిల పర్యటన..!

Last Updated : Jun 24, 2021, 10:25 PM IST

ABOUT THE AUTHOR

...view details