ప్రశ్నించే హక్కు లేకపోతే... అది నిజమైన ప్రజాస్వామ్యం కాదు.. ఇది రాజ్యాంగ నిపుణులు చెప్పిన మాట. ఈ విషయాన్నే ఆమె ఆచరించింది. విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో 12 మంది మరణం, వందల సంఖ్యలో బాధితులు, పర్యావరణ ఇబ్బందులపై తలెత్తిన సందేహాల్ని ఫేస్‌బుక్ వేదికగా ప్రశ్నించింది. ఫలితంగా ఏపీ సీఐడీ విచారణ ఎదుర్కొవాల్సి వచ్చింది. అంతేనా అంటే ఈ కేసు ఇక్కడితో పూర్తయ్యేలా కనిపించడం లేదు. ఎందుకంటే.. మీరు చేసిన పోస్టింగ్‌ల సంగతేంటని కూడా సీఐడీ ఆమెను ప్రశ్నించింది. ఆమె పాత పోస్ట్‌లను కూడా తిరగదొడుతున్నట్లు కనిపిస్తోంది. ఇంతకీ విచారణలో ఆమెను ఏం అడిగారు? రంగనాయకమ్మ ఏం చెప్పారు?
విశాఖ ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్ లీకేజ్ ఘటన రాష్ట్రంలో మునుపెన్నడు లేనంత తీవ్రస్థాయి దుర్ఘటన. దేశాన్నంతా ఒక్కసారి ఉలికిపాటుకు గురిచేసింది. మరో భోపాల్ గ్యాస్ ప్రమాదాన్ని గుర్తు చేసింది. కళ్లముందే.. పిల్లలూ.. పెద్దలు ఒరిగిపోయిన దృశ్యాలు చూసి నిర్ఘాంతపోయాం.. అసలు ఎందుకిలా జరిగింది? ప్రమాదానికి కారణాలేంటి? కంపెనీ యాజమాన్యం ఎక్కడ తప్పు చేసింది? ప్రభుత్వం, పోలీసులు ఎలా వ్యవహరించారు? ఇవన్నీ కూడా అందరిలో నెలకొన్న సందేహాలు.
ఆ సందేహాలనే ఫేస్‌బుక్ వేదికగా రఘునాథ్ అనే వ్యక్తి లేవనెత్తారు. గుంటూరుకు చెందిన 65 ఏళ్ల రంగనాయకమ్మ... ఆ పోస్టుని చూసి తన ఫేస్‌బుక్ వాల్‌పై షేర్ చేశారు. అలా ఆ పోస్టు చాలామందికే చేరింది. ఈ విషయం ఆ రాష్ట్ర సీఐడీ దృష్టికి వెళ్లింది. ఆమెకు నోటీసులు అందజేసింది. తమ ఎదుట హాజరుకావాలని చెప్పింది. ఆమె చేసిందల్లా... కేవలం ప్రశ్నించడమే..
గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి ఆమె విచారణ కోసం వెళ్లింది. మహిళను విచారించటం కోసం మహిళా కానిస్టేబుల్ ఉండాలనే నిబంధన మేరకు కాసేపు బయటే ఉండమని చెప్పారు. లేడీ కానిస్టేబుల్ వచ్చిన తర్వాత విచారణ కోసం పిలిచారు. ముందుగా సీఐ దిలీప్ ఆమెను విచారించారు. దాదాపు రెండు గంటల తర్వాత సీఐడీ అదనపు ఎస్పీ విజయ్ పాల్ వచ్చారు. మెుత్తం మూడు గంటల పాటు ఆమెను విచారణ జరిగింది.
రంగనాయకమ్మపై నమోదు చేసిన కేసులు:
సీఆర్పీసీ-41ఏ కింద ఆమెకు అరెస్టు నోటీసులిచ్చారు. సీఆర్.నెంబర్ 24/2020 యూ/ఎస్ 505(2), 153(ఏ), 188, 120-బీ ఆర్/డబ్ల్యూ 34 ఐపీసీ, సెక్షన్ 67 ఆఫ్ ఐటీ యాక్ట్-2008 కేసు నమోదు చేశారు.
సీఐడి అధికారుల ప్రశ్నలు
ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎందుకు పోస్టు పెట్టారు? తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నారు. మీ ఉద్దేశం ఏమిటి? రఘునాథ్ అనే వ్యక్తి షేర్ ఆప్షన్ లేకుండా తన ఫేస్ బుక్‌లో పోస్టు పెట్టారు. కానీ మీరు దాన్ని కాపీ చేసి మరీ మీ ఫేస్ బుక్ పేజీలో పెట్టాల్సిన అవసరం ఏంటి? మీరు గతంలో పెట్టిన పోస్టుల సంగతేంటి?
గతంలో నా ఫేస్‌బుక్ పోస్టులపై కూడా అడిగారు. అన్నింటిని ప్రజల కోసమే నా అభిప్రాయంగా చెప్పా. పత్రికలు, టీవీల్లో దృశ్యాలు చూసి స్పందించాను. సీఐడీ అధికారులు ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు.