Ramadevi Public School Sports Festival : రమాదేవి పబ్లిక్ స్కూల్‌లో స్పోర్ట్స్ డే సందర్భంగా.. మైదానంలో ఎన్సీసీ క్యాడెట్లు అతిథులకు మార్చ్‌ఫాస్ట్ ద్వారా ఘన స్వాగతం పలికారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం సాంస్కృతిక నృత్యాలతో కార్యక్రమం ప్రారంభమైంది. జాతీయ జెండాతో పాటు పాఠశాల, క్రీడలకు సంబంధించిన జెండాలను ఆవిష్కరించారు. క్రీడాజ్యోతిని వెలిగించి మైదానం చుట్టూ ప్రదర్శించారు.
పాఠశాలలో గంగా, యమున, కావేరి, కృష్ణ అనే నదుల పేర్లతో ఉన్న హౌసెస్ మధ్య పోటీలు పెట్టగా.. వారిలో విజేతలైన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఫిల్మ్‌సిటీ ఎండీ విజయేశ్వరి కుమారుడు సుజయ్ చదరంగం ఛాంపియన్లతో సరదాగా చెస్ ఆడారు. పాఠశాలలో 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఐదుగురు విద్యార్థులకు 'రామోజీ బంగారు పతకాన్ని' అందించారు. సైన్స్, లెక్కల సబ్జెక్టులో ఎక్కువ మార్కులు సాధించిన మరో ఐదుగురికి 'ఈనాడు బంగారు పతకాన్ని' ప్రదానం చేశారు. పాఠశాల తరఫున జాతీయ స్థాయిలో క్రీడలకు ఎంపికైన క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందించారు.
మైదానంలో వివిధ రూపాల్లో వ్యాయామ నృత్యాలు చేసిన విద్యార్థులకు ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరి ప్రత్యేక అభినందనలు తెలిపారు. చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యమని, ప్రతి విద్యార్థి ఆటల్లో పాల్గొనాలని సూచించారు. అంతకు ముందు పాఠశాల తరగతి గదులను పరిశీలించిన ఆమె.. డిజిటల్ తరగతి గదిలో కూర్చొని పాఠాలు విన్నారు.
"పాఠశాల తరఫున జాతీయ స్థాయి క్రీడలకు ఎంపికైన క్రీడాకారులకు అభినందనలు. మైదానంలో వ్యాయామ నృత్యాలు చేసిన విద్యార్థులకు అభినందనలు. చదువుతో పాటు క్రీడలు కూడా జీవితంలో ముఖ్యం. ప్రతి విద్యార్థి ఆటల్లో పాల్గొనాలి." -సి.హెచ్. విజయేశ్వరి, రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీ