TSPSC Paper Leakage Case update : టీఎస్‌పీఎస్సీలో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తూ.. ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో నిందితుడిగా ఉన్న రాజశేఖర్ రెడ్డికి కోర్టు బెయిల్ తిరస్కరించింది. ప్రశ్నాపత్రాల లీకేజీ కేసు దర్యాప్తు దశలో ఉందని.. ఆయనకు బెయిల్ ఇస్తే దర్యాప్తుపై ప్రభావం పడుతుందన్న సిట్ తరఫు న్యాయవాది వాదనతో కోర్టు ఏకీభవించింది. పబ్లిక్ కమిషన్‌లో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తున్న రాజశేఖర్ రెడ్డి, ప్రధాన నిందితుడు ప్రవీణ్‌తో కలిసి ప్రశ్నాపత్రాలను లీక్ చేశాడని.. పలువురికి విక్రయించి లక్షల్లో డబ్బులు వసూలు చేసినట్లు సిట్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని.. నిందితులు ఎవరెవరికి ప్రశ్నాపత్రాలు విక్రయించారో తెలుసుకోవాల్సి ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. న్యూజిలాండ్‌లో ఉన్న తన బావ ప్రశాంత్ రెడ్డికి రాజశేఖర్ రెడ్డి గ్రూప్-1 ప్రిలిమినరీ ప్రశ్నాపత్రం విక్రయించాడని.. అతను ఇంకా పరారీలోనే ఉన్నట్లు సిట్ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. మార్చి 13న రాజశేఖర్‌రెడ్డిని అరెస్ట్ చేశారని.. 2 నెలలకు పైగానే జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నట్లు నిందితుడి తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తాడని.. బెయిల్ మంజూరు చేయాలని రాజశేఖర్ రెడ్డి తరఫు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసి పుచ్చింది.