Traffic Jam in Hyderabad Due to Rains :హైదరాబాద్‌లో మూడు రోజులుగా కురుస్తన్న వర్షం ప్రభావం.. గురువారం తీవ్రంగా మారింది. రహదారులపై నీళ్లు చేరి దాదాపు నగరంలోని అన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ఉదయం కార్యాలయాలకు వెళ్లే సమయం.. సాయంత్రం తిరిగొచ్చే సమయంలో రోడ్లపై గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. ముఖ్యంగా ఉదయం చిన్నారులంతా బడికెళ్లిన కొద్దిసేపటికే.. ప్రభుత్వం రెండ్రోజుల సెలవు ప్రకటించడం ట్రాఫిక్‌పై తీవ్ర ప్రభావం చూపింది.
అప్పటికే చిన్నారుల్ని దింపేందుకు వచ్చిన స్కూల్ బస్సులు, ఇతర వాహనాలు, తల్లిదండ్రులు మళ్లీ తిరుగుముఖం పట్టి పాఠశాలలకు వెళ్లడం.. ఆ వెంటనే తిరిగి ఇళ్లకు చేర్చే క్రమంలో రెండు గంటలు నగరం నలుదిక్కులా ట్రాఫిక్ స్తంభించింది. దీంతో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ సిగ్నళ్లు హారన్ల మోతతో దద్దరిల్లాయి. మియాపూర్ నుంచి కొండాపూర్ రావడానికి సగటున 30 నిమిషాల్లోపే ఉండగా.. గురువారం కనీసం 3 గంటల సమయం పట్టింది.
Hyderabad Rains : మరోవైపు సికింద్రాబాద్ నుంచి బేగంపేటకు వచ్చేందుకు.. 2 గంటలకు పైగా సమయం పట్టింది. మియాపూర్ నుంచి బాలానగర్ చౌరస్తాదీ అదే పరిస్థితి. బాలానగర్ వై జంక్షన్ దగ్గర కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఎల్బీనగర్ నుంచి పంజాగుట్ట వరకు ఎటుచూసినా రహదారులపై వాహనాలు బారులుతీరాయి. సికింద్రాబాద్, బేగంపేట, అమీర్‌పేట, జూబ్లీహిల్స్, మాదాపూర్ మార్గంలో ఎక్కడా వాహనదారులకు దారి కనిపించనంతలా రద్దీ కనిపించింది.
Massive Traffic Jam in Hyderabad Due to Rains :మధ్యాహ్నం కొద్దిసేపు కుదుటపడ్డా.. వర్షం తీవ్రత పెరిగాక.. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ట్రాఫిక్ తీవ్రత మరింత పెరిగింది. ఐటీ కారిడార్, మాదాపూర్, కూకట్‌పల్లి, మియాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, జేఎన్‌టీయూ, మూసాపేట, బాలానగర్, చాదర్‌ఘాట్, మలక్‌పేట, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్‌జామ్‌లు కనిపించాయి. రహదారులపైకి వరద నీరు చేరి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.