Rahul Gandhi Election Campaign in Telangana : తెలంగాణ శాసనసభ ఎన్నికలో లక్ష్యంగా కాంగ్రెస్ ముమ్మర ప్రచారం చేస్తోంది. ఇప్పటివరకు ఒక లెక్క అయితే ఇప్పుడు నుంచి ఒక లెక్క అన్నట్లు హస్తం పార్టీ జాతీయ నాయకులతో నియోజకవర్గాలను చుట్టేసే పనిలో పడింది. ఓటర్లను ఆకర్షించి.. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి బహుమతి, అలాగే ఇక్కడి గెలుపుతోనే మిగిలిన రాష్ట్రాలో గెలవాలని చూస్తోంది. ఈ ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) నేడు పినపాక, నర్సంపేట బహిరంగ సభల్లో పాల్గొన్నారు. అనంతరం బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు.
కేవలం ఒకే కుటుంబం కోసం తెలంగాణ ఇవ్వలేదని.. తెలంగాణ ప్రజల కోరిక మేరకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. మరో 17 రోజుల్లో ప్రజల సర్కార్ వస్తోందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు బీఆర్‌ఎస్(BRS) నేతలు నడుస్తున్న రోడ్లు కాంగ్రెస్ వేసినవే అనే విషయాన్ని అందరూ గుర్తించుకోవాలన్నారు. కాంగ్రెస్ ఏం చేసిందని కేసీఆర్, కేటీఆర్‌లు అడుగుతున్నారు.. వారిద్దరూ నడుస్తున్న రోడ్లు కాంగ్రెస్ వేసినవే కదా అని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ రాకముందే హైదరాబాద్‌ను కాంగ్రెస్ ఐటీ కేపిటల్(Hyderabad IT Capital) చేసిందని గుర్తు చేశారు. ప్రస్తుతం శాసనసభ ఎన్నికలు దొరలు తెలంగాణ, ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతున్న పోరాటంగా రాహుల్ అభివర్ణించారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు కాంగ్రెస్ అగ్రనేతల రాక - ప్రచార కాక
Rahul Gandhi Participate Congress Road Shows :గత పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన ప్రతి పనిలోనూ ఆ పార్టీ నేతల అవినీతి కనిపిస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project)లో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందన్నారు. బీఆర్‌ఎస్ పాలనకు అంతం పలికే సమయం ఆసన్నమైందని.. ప్రాముఖ్యత ఉన్న మంత్రి పదవులు అన్నీ సీఎం కేసీఆర్ దగ్గరే అంటిపెట్టుకుని ఉంచుకున్నారని విమర్శలు చేశారు. ధరణి పోర్టల్ ద్వారా వేల ఎకరాలు లాక్కున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు మూడు ఒక్కటేనని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.