తెలంగాణ

telangana

ETV Bharat / state

Hyderabad pubs : పబ్బుల్లో అదే గబ్బు.. యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన - Hyderabad pubs nuisance

Hyderabad pubs : హైదరాబాద్​లో పబ్బుల వల్ల చిన్నాపెద్దా అందరూ ఇబ్బంది పడుతున్నా వాటి తీరు మార్చుకోవడం లేదు. కాసుల కోసం నిబంధనలను తుంగలో తొక్కేస్తున్నాయి. తప్పుడు ధ్రువపత్రాలతో మైనర్లతో మద్యం రహిత పార్టీలకు అనుమతిస్తున్నాయి. అమ్మాయిలపై అఘాయిత్యాలు పెరుగుతున్నా వీటి తీరు మారడం లేదు. అధికారులు కూడా అంటీముట్టనట్లు వ్యవహరిస్తుండటంతో యథేచ్ఛగా పబ్​లు నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయి.

పబ్
పబ్

By

Published : Jun 13, 2022, 8:22 AM IST

Hyderabad pubs : హైదరాబాద్​లో పబ్బుల వల్ల చిన్నాపెద్దా అందరూ ఇబ్బంది పడుతున్నా వాటి తీరు మారడం లేదు. నిబంధనలను ఉల్లంఘిస్తాం.. కోట్ల రూపాయలు ఆర్జిస్తాం.. అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. ప్రశ్నిస్తే బౌన్సర్లతో దాడులు చేయించడం. అనుమతుల్లేకుండా వేడుకలు.. మైనర్లను అనుమతించడం.. రాత్రుళ్లు భారీ శబ్దాలతో నృత్యాలు.. మద్యం సరఫరా కొనసాగిస్తున్నారు. గత నెలలో జూబ్లీహిల్స్‌లోని అమ్నీషియా పబ్‌లో జరిగిన మద్యరహిత పార్టీలో ఓ బాలికపట్ల కొందరు యువకులు, బాలలు అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు కారులో తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. పబ్‌లపై పూర్తిస్థాయి నియంత్రణ పెడతామంటూ హోంమంత్రి ప్రకటన చేశారు. ఇది జరిగి రెండు వారాలు కాకముందే పబ్బులు మళ్లీ కాసుల కోసం నిబంధనలను తుంగలో తొక్కేస్తున్నాయి. తప్పుడు ధ్రువపత్రాలతో మైనర్లతో మద్యం రహిత పార్టీలకు అనుమతిస్తున్నాయి.

కేసులు బేఖాతరు..నగరంలో 120 వరకు పబ్బులున్నాయి. జూబ్లీహిల్స్‌లో అత్యధికంగా 28కి పైగా కొనసాగుతున్నాయి. గడిచిన ఆరు నెలల కాలంలో సమయం దాటి, శబ్ద కాలుష్యానికి పాల్పడుతున్న పబ్‌లపై జూబ్లీహిల్స్‌ పోలీసులు 25కి పైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. 50-60 వరకు పెట్టీ కేసులు పెట్టారు. చట్టప్రకారం ఇవన్నీ కేవలం జరిమానా చెల్లించే విధంగా ఉండటంతో వారు ఖాతరు చేయడంలేదు. సరైన స్థానంలో సీసీ కెమెరాలు ఉండడంలేదు. రిజిస్టర్ల, నౌకర్‌నామా నిర్వహణ లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అనుమానితుల ధ్రువపత్రాలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఆరు నెలల వ్యవధిలో జూబ్లీహిల్స్‌ ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ పోలీసులు 35కి పైగా పబ్‌లపై కేసులు నమోదు చేశారు.

అనుమతి ఒకచోట..మద్యం సరఫరా అనుమతులు ఒక ప్రాంతంలో తీసుకొని మరో ప్రాంతంలో సరఫరా చేస్తున్నాయి. బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ పేరిట అనుమతులు తీసుకొనే పబ్‌లకు ఇండెంట్‌ ప్రకారం మధ్యం సరఫరా చేస్తారు. కాని ప్రభుత్వానికి నష్టం కలిగించేలా కొందరు నిర్వాహకులు బయటి నుంచి మద్యం తీసుకొచ్చి విక్రయిస్తున్నారు.

ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ సీఐ పోస్టు ఖాళీ..పబ్‌లపై ఎక్సైజ్‌ శాఖ నిర్లక్ష్యం స్పష్టంగా కన్పిస్తోంది. జూబ్లీహిల్స్‌ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించే ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ సీఐ బదిలీఅయి రెండు నెలలు కావొస్తున్నా కొత్త సీఐని నియమించలేదు. ఎస్సై ఆ బాధ్యతలు చూస్తున్నారు.

నేతల అండదండలు..జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ ప్రాంతాల్లోని కీలక పబ్‌లు రాజకీయ పార్టీల నేతల కనుసన్నల్లో నడుస్తున్నాయి. ఆయా నేతల పేర్లు చెప్పి కిందిస్థాయి పోలీసు, ఎక్సైజ్‌ అధికారులను నిర్వాహకులు బెదిరిస్తున్నారు.

వారాంతాల్లో ఇప్పటికీ వేడుకలు..బాలికపై అత్యాచారం జరిగిన తర్వాత, పబ్బుల్లో వేడుకలు నిర్వహిస్తే ఎక్సైజ్‌ శాఖకు డిక్లరేషన్‌ ఇవ్వాలని ఆ శాఖ పోలీసులు పబ్‌ నిర్వాహకులకు తేల్చిచెప్పారు. కానీ ఇప్పటికీ వారాంతాల్లో అనుమతుల్లేకుండానే వేడుకలు నిర్వహిస్తున్నాయి. ఇందుకుగాను జూబ్లీహిల్స్‌లోని ఒక పబ్‌కు ఎక్సైజ్‌ పోలీసులు నోటీసులు సైతం జారీ చేశారు. ముఖ్యంగా వారాంతాల్లో పబ్‌లపై పర్యవేక్షణ కొరవడుతోంది.

పార్కింగ్‌ అతిపెద్ద సమస్య..పబ్బుల్లో అతిపెద్ద సమస్య పార్కింగ్‌. వాలెట్‌ పార్కింగ్‌ తీసుకొనే వాహనాలను సైతం రోడ్డు పక్కనే నిలుపుతున్నారు. వారాంతాల్లో జూబ్లీహిల్స్‌ రోడ్డు నం.1, 10, 36, 45లలో రాత్రుళ్లు ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతోంది. అమ్నీషియా పబ్‌ వేర్వేరు పేర్లతో అయిదంతస్తుల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దీని పార్కింగ్‌ ప్రాంతం కేవలం 20-30 వాహనాలకే సరిపోతుంది. జూబ్లీహిల్స్‌లోని 28 పబ్‌లలో 80-90 శాతం వాటికి పార్కింగ్‌కు సరైన సౌకర్యం లేదు.

ABOUT THE AUTHOR

...view details