మన ఠాణా పరిధుల్లో ఇకపై గంజాయి, గుట్కా, కొకైన్, ఎల్‌ఎస్‌డీ అక్రమ రవాణా ఉండకూడదు.. మాదక ద్రవ్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో గుర్తించండి, వాటిని పూర్తిగా నిర్మూలించేందుకు గట్టిగా కృషి చేయండి, దుకాణాలు, ఏజెంట్లు, ట్రాన్స్‌పోర్ట్ కంపెనీలు ఇలా వేటినీ వదలకండి.. ఆన్‌లైన్‌లో డ్రగ్స్ సరఫరాపై ఐటీ సెల్, సైబర్ క్రైం విభాగాలు పరిశోధిస్తున్నాయి, వేగంగా స్పందించండి.. భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుకున్నా, అంతర్జాతీయ స్మగ్లర్లను అరెస్టు చేసినా పదోన్నతులు ఇస్తాం.
-మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక డ్రైవ్ నేపథ్యంలో పోలీసు అధికారులు, సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఉన్నతాధికారుల మాటలివి.
రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగం పెరుగుతోందన్న సమాచారంతో ముఖ్యమంత్రి కేసీఆర్(cm kcr on drugs) ఈ నెల 20న ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు కార్యాచరణ రూపొందించారు. ఇందులో భాగంగానే పదోన్నతుల మాట చెప్పారు
మజా కోసం మాదక ద్రవ్యాలు..మద్యం మత్తు కంటే మాదక ద్రవ్యాల మత్తు ఎక్కువగా ఉంటుందన్న భావనతో కొందరు యువకులు, విద్యార్థులు గంజాయి, మెఫిడ్రిన్, ఎల్‌ఎస్‌డీని వినియోగిస్తున్నారు. కొకైన్ ఖరీదైన వ్యవహారంగా మారడంతో వీరంతా గంజాయిపై దృష్టి కేంద్రీకరించారు. ఇంజినీరింగ్ విద్యార్థులు, ఐటీ సంస్థల్లో పనిచేస్తున్న కొందరు గంజాయి మత్తుకు అలవాటుపడ్డారు. గంజాయిని కొనేందుకు పదేపదే డబ్బు ఖర్చు చేయడం ఎందుకున్న భావనతో.. నేరుగా వీరే విశాఖపట్నం, చింతపల్లి, నర్సీపట్నం, ఆంధ్రా - ఒడిశా సరిహద్దులకు వెళుతున్నారు. అక్కడ కిలో గంజాయిని రూ.1500కు కొని హైదరాబాద్‌కు తీసుకువచ్చి ఎండబెట్టి.. చిన్నచిన్న పొట్లాలుగా మార్చి ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు.
సమాచారం... మనకెందుకు రాదు!
గంజాయి అక్రమ రవాణాపై కేంద్ర సంస్థలు డెరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, మాదక ద్రవ్యాల నియంత్రణ మండలి(NCB)అధికారులకు సమాచారం వస్తోంది. వారు లారీలు, డీసీఎంలలో తరలిస్తున్న వేల క్వింటాళ్ల గంజాయిని పట్టుకున్నారు. ఆ సమాచారం మనకు ఎందుకు రావడం లేదని పోలీసు ఉన్నతాధికారులు అంతర్గతంగా అధికారులు, సిబ్బందితో చర్చించారు. అనంతరం రాష్ట్ర నిఘా వర్గాల ద్వారా సమచారం సేకరించగా.. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతం, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి గంజాయి క్వింటాళ్ల కొద్దీ వస్తోందని, వీటిని లారీలు, కంటెయినర్లలో అక్రమార్కులు తీసుకువస్తున్నారని తెలుసుకున్నారు. వైజాగ్ నుంచి రైళ్లు, బస్సుల్లో స్మగ్లర్లు గంజాయిని తరలిస్తున్నారని గుర్తించారు.
మూడు అంచెల్లో..
మాదక ద్రవ్యాల సరఫరాను నిర్మూలించేందుకు పోలీసు ఉన్నతాధికారులు మూడంచెల వ్యూహాన్ని రూపొందించారు. హైదరాబాద్ నగరం, శివారు ప్రాంతాల్లో గంజాయి, కొకైన్, ఎల్‌ఎస్‌డీ, ఎండీఎంఏల సరఫరా దారులు, రవాణా నెట్‌వర్క్‌ను బ్రేక్ చేయడం తొలి అంచె. నగరానికి వేర్వేరు మార్గాల ద్వారా వస్తున్న మాదక ద్రవ్యాలు, వాటిని తరలిస్తున్న వ్యక్తులను గుర్తించి అరెస్ట్ చేయడం రెండో అంచె. మాదక ద్రవ్యాల వినియోగం ఏఏ ప్రాంతాల్లో ఉందో గుర్తించి ఆ ప్రాంతాల్లో పోలీసుల నిఘా ఉంచడం, అవసరమైతే రాత్రి వేళల్లో తాత్కాలిక చెక్‌పోస్టులు ఏర్పాటు చేయడం వంటివి మూడో అంచెగా నిర్ణయించారు. వివిధ స్థాయిల్లో జరుగుతున్న ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షించేందుకు ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేశారు. డ్రగ్ రాకెట్‌ను(drugs in telangana) ఛేదించినా. మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకుని నెట్‌వర్క్‌ను బ్రేక్ చేసినా.. పదోన్నతులు కల్పించనున్నారు.
ఇదీ చదవండి:Huzurabad By Election 2021: హుజూరాబాద్‌లో సీఎం కేసీఆర్ ప్రచారం లేనట్లే!