ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స కోసం ఉద్యోగులు, పింఛనుదారులు కొండంత ఖర్చు చేస్తే ప్రభుత్వం నుంచి గోరంత మాత్రమే తిరిగొస్తోంది. అందుకోసం కూడా నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. మెడికల్ రీయింబర్స్‌మెంట్ పథకం కింద దరఖాస్తులను స్థానిక కార్యాలయం నుంచి రాష్ట్రస్థాయి వరకు కదల్చడానికీ వ్యయప్రయాసలకు గురికావలసి వస్తోంది. ఆసుపత్రుల్లో బిల్లులు లక్షలు దాటుతుండగా పదమూడేళ్ల నాటి జీవో ఆధారంగా గరిష్ఠంగా లక్ష మాత్రమే మంజూరు చేస్తుండటంతో ఉద్యోగులు, పింఛనుదారులు ఉసూరుమంటున్నారు.
ఓపెన్ హార్ట్ సర్జరీ, మూత్రపిండాలు, కాలేయం, తదితర అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు, గుండె రక్తనాళాల్లో మూడు స్టెంట్లు వేయడం, పేస్‌మేకర్, ప్లాస్టిక్ సర్జరీ, క్యాన్సర్ తదితర 10 రకాల చికిత్సలకు మాత్రమే రూ.2 లక్షల వరకు చెల్లిస్తున్నారు. వైద్యబిల్లుల తిరిగి చెల్లింపులో లోటుపాట్లు ఉన్నాయనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, పింఛనుదారులకు ప్రత్యేకంగా నగదు రహిత వైద్యం అందించే పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. రాష్ట్రంలో ఉద్యోగులు 2.90 లక్షలు, పింఛనుదారులు 2.88 లక్షల మంది ఉంటారు. వీరి కుటుంబ సభ్యులు కూడా ఈ పథకాల పరిధిలోకి వస్తారు. ఈ పథకం అమలుకు తొలుత ప్రత్యేకంగా సీఈఓను కూడా నియమించారు. ఏటా బడ్జెట్‌లోనూ రూ.400 కోట్ల వరకూ కేటాయిస్తున్నారు. సమయానుకూలంగా నిధులు విడుదల కాకపోవడం ఈ పథకానికి పెద్దశాపంగా పరిణమించింది. బకాయిలు పేరుకుపోవడంతో అత్యధిక కార్పొరేట్ ఆసుపత్రులు ఉద్యోగుల ఆరోగ్య కార్డును తిరస్కరిస్తున్నాయి. దీంతో గత్యంతరం లేక నగదు చెల్లించి చికిత్స పొందాల్సి వస్తోంది. ఉద్యోగులు, పింఛనుదారులు ఎదుర్కొంటున్న ఈ సమస్యలు ప్రభుత్వం దృష్టికి రావడంతో.. సర్కారు కూడా నగదు రహిత చికిత్సను కొనసాగిస్తూనే మరోవైపు వైద్యబిల్లుల తిరిగి చెల్లింపు పథకాన్ని కూడా అమలు చేస్తోంది.
బిల్లు పొందాలంటే ఎంత తతంగమో..!
*బిల్లులను తాము పనిచేస్తున్న జిల్లాలోని తమ శాఖ కార్యాలయంలోనే సమర్పించాలి
*రూ.50 వేల లోపు ఉన్న వైద్యబిల్లులను జిల్లాలోనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని పరిశీలనాధికారులు పరిశీలించి, సరైనవేనని భావిస్తే స్థానిక ఖజానా కార్యాలయానికి చెల్లింపుల కోసం పంపిస్తారు.
*ఒకవేళ బిల్లులు రూ.50 వేలు దాటితే సంబంధిత శాఖ రాష్ట్ర కార్యాలయానికి పంపిస్తారు.
*రాష్ట్ర కార్యాలయం నుంచి ఆ బిల్లులు వైద్యవిద్య సంచాలకుల కార్యాలయానికి చేరతాయి.
*ఇక్కడ బిల్లుల పరిశీలన అనంతరం అవి సరైనవిగా భావిస్తే.. అత్యధిక కేసులకు గరిష్ఠంగా రూ.లక్ష మంజూరు చేస్తారు. సుమారు 10 రకాల జబ్బులకు మాత్రమే గరిష్ఠంగా రూ.2 లక్షలు మంజూరు చేస్తారు.
*మంజూరైన బిల్లు తిరిగి సంబంధిత శాఖ రాష్ట్ర కార్యాలయానికి, అక్కడి నుంచి జిల్లా కార్యాలయానికి చేరుతుంది. ఇక్కడి నుంచి జిల్లా ఖజానా కార్యాలయానికి పంపిస్తారు.
*ఒకవేళ తమకు చెల్లించిన మొత్తంపై అసంతృప్తి ఉంటే.. ఉద్యోగులు, పింఛనుదారులు తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చు.
*రాష్ట్ర స్థాయిలో ఐదుగురు ఐఏఎస్‌లతో కూడిన ప్రత్యేక కమిటీ ఆ దరఖాస్తును పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. అయితే ఈ విషయం అత్యధిక ఉద్యోగులు, పింఛనుదారులకు తెలియదు. ఈ తరహాలో బిల్లులు పొందేవారు 1 శాతం కూడా ఉండరు.
*పైగా మళ్లీ దరఖాస్తు చేయాలంటే కూడా.. మళ్లీ కింది నుంచి దస్త్రం కదలాల్సిందే.