తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా రోగుల రక్తాన్ని తాగుతున్న కార్పొరేట్​ ఆస్పత్రులు! - తెలంగాణ తాజా వార్తలు

రాష్ట్రంలోని ప్రైవేట్​ కార్పొరేట్​ ఆస్పత్రులు కరోనా రోగులను నిలువు దోపిడీ చేస్తున్నాయి. కరోనా వైరస్‌ బాధితులు ఆసుపత్రుల్లో ఉన్న రోజులను బట్టి ఫీజులు గుంజుతున్నాయి. కొన్నిచోట్ల డెబిట్‌/క్రెడిట్‌ కార్డులతో కాకుండా నగదు మాత్రమే ఇవ్వాలంటున్నారు. పలు జిల్లాల్లో వీటి ఆగడాలను అరికట్టలేక.. అధికారులు మౌనం దాలుస్తున్నారు.

hospitals
కార్పొరేట్​ ఆస్పత్రులు

By

Published : Apr 23, 2021, 7:57 AM IST

ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో రెండో దశ దోపిడీ తీవ్రత మొదలైంది. కరోనా వైరస్‌ బాధితులు ఆసుపత్రుల్లో ఉన్న రోజులను బట్టి ఫీజులు గుంజుతున్నాయి. కొన్నిచోట్ల డెబిట్‌/క్రెడిట్‌ కార్డులతో కాకుండా నగదు మాత్రమే ఇవ్వాలంటున్నారు. పలు జిల్లాల్లో వీటి ఆగడాలను అరికట్టలేక.. అధికారులు మౌనం దాలుస్తున్నారు. బాధితుల ఫిర్యాదుల మేరకు చర్యలు తీసుకోబోతే.. ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిడి రావడంతో ఆగిపోతున్నారు. దీంతో ఫీజుల దోపిడీకి అదుపు లేకుండా పోతోంది. కాకినాడ, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి.. ఇలా పలుచోట్ల ఫీజులను భారీగా వసూలు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి కరోనా సోకగా, ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున చెల్లించాలని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. ప్రజాప్రతినిధి జోక్యంతో ఫీజులో కొంత రాయితీ ఇచ్చారు. ఇలా మధ్యతరగతి కుటుంబాలు అప్పులపాలు అవుతున్నాయి.
పెరుగుతున్న గిరాకీ
రాష్ట్రంలో కరోనా ఫీజుల దందాపై గత సంవత్సరం హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై ఇప్పటికీ విచారణ జరుగుతూనే ఉంది.
మలి విడతలో వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా ఉంది. కేసులు పెరిగేకొద్దీ... ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులకు గిరాకీ పెరుగుతోంది. ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స ఇష్టం లేనివారు మంచి వైద్యం అందుతుందని ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులవైపు మొగ్గుచూపుతున్నారు. ‘కార్పొరేట్‌, ప్రైవేటు ఆసుపత్రుల్లో పరిమితంగానే కరోనా చికిత్స అందుబాటులో ఉంది. అయినా తమకు ఫలానా ప్రైవేటు ఆసుపత్రిలోనే పడక కావాలని కొందరు పట్టుబడుతున్నారు. దీనివల్ల ఆసుపత్రులకూ డిమాండ్‌ వస్తోంది’ అని ఓ సీనియర్‌ అధికారి పేర్కొన్నారు.
ఎంబీబీఎస్‌లతోనే వైద్యం...!
కొవిడ్‌ చికిత్సలో జనరల్‌ ఫిజిషియన్‌/పల్మనాలజిస్టు మత్తుమందు వైద్యులు కీలకం. వెంటిలేటర్‌ అమర్చాలంటే.. మత్తుమందు వైద్యనిపుణులు అవసరం. ప్రైవేటు ఆసుపత్రులు వీరిని నియమిస్తున్నాయా.. లేవా? అన్నది తెలియదు. ఎంబీబీఎస్‌ పూర్తిచేసిన వారిని డ్యూటీ డాక్టర్లుగా పేర్కొంటూ వారికి విధులు అప్పగిస్తున్నాయి. వీరికి నెలకు ప్రస్తుత పరిస్థితుల్లో రూ.75వేల వరకు చెల్లిస్తున్నాయి. నర్సులు, ఇతర సిబ్బందికి ఇంతకుముందు నెలకు రూ.20వేలు ఇస్తే ఇప్పుడు మరో రూ.10వేలు ఇస్తున్నాయి. ఈ భారమంతా రోగులపైనే పడుతోంది. కేసు సీరియస్‌ అయితే... హడావుడి చేసి, మరో ఆసుపత్రికి వెళ్లాలని చెబుతున్నారు. ఒక్కోసారి ఫీజు మొత్తం వసూలుచేశాకే సీరియస్‌ అయిన విషయాన్ని చెబుతున్నాయి.
వివరాలు చెప్పరు...
ఎన్ని రోజులపాటు చికిత్స అందిస్తారు? ఏయే మందులు వాడుతారు? వైద్యులు ఎప్పుడెప్పుడు వస్తున్నారో... కూడా బాధితులకు తెలియడంలేదు. రోగి పరిస్థితి ఎలా ఉన్నా.. వైద్యులు, సిబ్బంది ధరించే పీపీఈ కిట్ల నుంచి, మందులు, గది, ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ ఇలా అన్నింటికీ భారీగా వసూలు చేస్తున్నాయి. ఇటీవల రెండు ఆసుపత్రులపై కృష్ణాజిల్లా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంది. కిందటేడాది వైద్యులు పీపీఈ కిట్లు ధరించి బాధితులకు చికిత్స అందించారు. ఇప్పుడు వాటి వాడకం తగ్గింది. మాస్కులు మాత్రం ధరిస్తున్నారు. పలు ఆసుపత్రుల్లో వైద్యులు దూరం నుంచే బాధితులను ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని అడుగుతున్నారు. వారు పూర్తిగా చెప్పకుండానే నర్సులకు సూచనలు ఇచ్చేసి, వెళ్లిపోతున్నారు. రక్తపోటు, మధుమేహం, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నా... వాటి గురించి వైద్యులు అడగట్లేదని, మొక్కుబడిగా మందులు రాసేసి వెళ్లిపోతున్నారని విజయవాడలో వైరస్‌ బాధితుడొకరు వాపోయారు. అందించిన చికిత్స పూర్తి వివరాలతో డిశ్ఛార్జి సమ్మరీ ఉండట్లేదు.
ఫిర్యాదుచేస్తే చర్యలు తీసుకుంటాం
కరోనా చికిత్సకు ఆసుపత్రులు అధిక ఛార్జీలు వసూలు చేయడంపై తమకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా.. లేదా 104కు ఫోన్‌ చేసినా తగిన చర్యలు తీసుకుంటామని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఇలా ఇప్పటికే విజయవాడలో రెండు ఆస్పత్రులపై చర్యలు తీసుకున్నామని గుర్తుచేశారు.

రెమ్‌డెసివిర్‌ ఇస్తున్నారో.. లేదో తెలియదు

చికిత్సలో కీలకంగా ఉన్న రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ రోగులకు ఇస్తున్నారో.. లేదో తెలియడంలేదు. వ్యాధి తీవ్రతను బట్టి 5 సార్లు ఇంజెక్షన్లు ఇవ్వాలి. గుంటూరు జిల్లా నరసరావుపేట, విశాఖలో ఈ సూదిమందు ఇవ్వకుండానే జరిగిన వసూళ్ల దందా వెలుగులోకి వచ్చింది. ‘నిబంధనలు ఉల్లంఘించే ఆసుపత్రులపై వెంటనే చర్యలు తీసుకోవడానికి కుదరడంలేదు. అక్కడ అప్పటికే రోగులు చికిత్స పొందుతూ ఉంటున్నారు. వీరంతా కోలుకునేందుకు ఎక్కువ సమయం పడుతోంది. వీరిని ఇతర ఆసుపత్రులకు పంపాలన్నా కష్టమే’ అని కృష్ణా జిల్లా అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి:వచ్చే నాలుగైదు రోజుల్లో విషమ పరిస్థితులు

ABOUT THE AUTHOR

...view details