కరోనా బారిన పడి స్థానికంగా వైద్యం చేయించుకొన్నా నయం కాకపోగా ఆక్సిజన్ స్థాయి 88కి పడిపోవడంతో ఏపీలోని కడప జిల్లాకు చెందిన ఓ వ్యక్తిని బుధవారం తెల్లవారుజామున అంబులెన్సులో హైదరాబాద్ తీసుకొచ్చారు. మూడు నాలుగు ప్రైవేటు ఆస్పత్రులకు తిరిగారు. వెంటిలేటర్ పడకకు రోజుకు రూ.1.50 లక్షలు అవుతుందని ఒకటి, రోజుకు రూ.లక్ష అవుతుందని మరొకటి, ముందుగా రూ.3 లక్షల డిపాజిట్ చేయమని ఇంకో ఆసుపత్రి స్పష్టం చేశాయి. అదీ నగదు రూపంలోనేనని మెలికపెట్టాయి. అంత స్థోమత లేదన్నా కనికరించలేదు. ఈలోగా అంబులెన్సులో ఆక్సిజన్ సిలిండర్ నిండుకోవడంతో చివరికి కొంపల్లిలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చేర్పించారు.
రాజధానిలో కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీకి ఇదొక ఉదాహరణ మాత్రమే. చాలా వరకు మానవత్వాన్ని మరిచి డబ్బే ధ్యేయంగా వ్యవహరిస్తున్నాయి. ఆక్సిజన్, వెంటిలేటర్ పడకలు ఖాళీగా ఉన్నా పైకి లేవని బుకాయిస్తున్నాయి. రోజుకు రూ.లక్ష ఆపైన చెల్లించడానికి సిద్ధపడే వారిని వెంటనే చేర్చుకొని వైద్యం ప్రారంభిస్తున్నాయి.
వెంటిలేటర్లపై ఉంచితేనే
భాగ్యనగరంలో 3 వేలకు పైగా చిన్నా, పెద్దా ఆస్పత్రులున్నాయి. మూడొంతుల వైద్యశాలల్లో కొవిడ్ వైద్యం అందిస్తున్నారు. వీటిలో 5 వేల వరకు పడకలున్నాయి. అధిక భాగం ఆక్సిజన్ వసతి ఉన్నవి, మరికొన్ని వెంటిలేటర్ పడకలు ఉన్నాయి. పక్షం రోజులుగా వైద్యశాలలను ఆశ్రయిస్తున్న బాధితుల్లో అధికులు ఆక్సిజన్ పడకకు గానీ, వెంటిలేటర్ పడకకు గానీ వస్తున్నవారే. వీరిలో ఆక్సిజన్ స్థాయిలు 80-90 మధ్య ఉండేవారే అధికులు. ఇలాంటివారికి నిమిషానికి 4-8 లీటర్ల ప్రాణవాయువు అందించాలి. కొందరు వెంటిలేటర్లపై ఉంచితేనే బతికి బట్టకట్టే స్థితిలో వస్తున్నారు.