management quota seats in BTech: హైదరాబాద్ ఎల్బీనగర్‌కు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి కుమార్తె ఎంసెట్ ‘కీ’ని చూసుకోగా.. 45 మార్కులొచ్చాయి. ఆ మార్కులకు మంచి ర్యాంకు రావడం కష్టమే. నగర శివారులోని ఇబ్రహీంపట్నం వద్ద ఉన్న ఓ కళాశాలను సంప్రదిస్తే.. కంప్యూటర్ సైన్స్ సీటు కావాలంటే నాలుగేళ్లకు రూ.6.80 లక్షలు ఫీజు, అదనంగా డొనేషన్ రూపంలో మరో రూ.7 లక్షలు చెల్లించాలని, సీటు బుకింగ్‌కు ముందస్తుగా రూ.25 వేలు చెల్లించాలని షరతు విధించారు.
ఎంసెట్‌లో ఎంత తక్కువ ర్యాంకు వచ్చినా.. రూ.10 లక్షలిస్తే చాలు.. మేనేజ్‌మెంట్ కోటా కింద సీటు ఇస్తామని ఘట్‌కేసర్ సమీపంలోని మరో కళాశాల యాజమాన్యం చెబుతోంది.
ప్యాకేజీగా మాట్లాడుకుని..:ఇంజినీరింగ్ విద్య నాలుగేళ్లకు కలుపుకొని కళాశాలలు ప్యాకేజీ మాట్లాడుకుంటున్నాయి. కంప్యూటర్ సైన్స్ విభాగానికి డిమాండ్ ఎక్కువగా ఉంది. దీనికి తగ్గట్టుగా సీట్లు పెంచుకుని ‘వసూళ్లు’ చేస్తున్నాయి. నగర శివారులోని ఓ ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలలో మేనేజ్‌మెంట్ కోటా కంప్యూటర్ సైన్స్ సీటు రూ.12-15 లక్షల మధ్య పలుకుతోంది. అందులోనూ సిఫార్సు ఉంటేనే తీసుకుంటున్నారు. కొన్ని కళాశాలలు రూ.8-10 లక్షల మధ్య వసూలు చేస్తున్నాయి. కంప్యూటర్ సైన్స్ అనుబంధ విభాగాల్లో కళాశాలను బట్టి సీట్లు రూ.6-10 లక్షలు పలుకుతున్నాయి. కొన్ని ప్రముఖ కళాశాలల్లో ఎలక్ట్రికల్, మెకానికల్‌లోనూ డిమాండ్ కనిపిస్తోంది.
management quota seats for BTech in Telangana : మేనేజ్‌మెంట్ కోటాలో సీట్లకు ‘ఏ’ కేటగిరీలోని ఫీజుల విధానమే వర్తిస్తుంది. అధికారికంగా ఉన్న ఫీజులను రెగ్యులర్‌గా కట్టించుకుంటూ.. మిగిలిన మొత్తాన్ని డొనేషన్ల రూపంలో వసూలు చేస్తున్నాయి. మేనేజ్‌మెంట్ కోటా సీట్లలో 15 శాతం వరకు ఎన్నారై స్పాన్సర్డ్ కేటగిరీలోకి మార్చుకునే వీలుంది. ఈ కోటాలో అధికారికంగా 5వేల యూఎస్ డాలర్లు ఫీజు ఉంటుంది. అలా మార్పిడి చేసి భారీగా వసూలు చేస్తున్నారు.
ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించాలన్న డిమాండ్ ఉన్నా..మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీపై ఉన్నత విద్యామండలి, ఫీజుల నియంత్రణ కమిటీ(ఎఫ్‌ఆర్సీ) పర్యవేక్షణ లోపంతో కళాశాలలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలున్నాయి. వాస్తవానికి 2005 వరకు కన్వీనర్ కోటాలో ఉచిత, చెల్లింపు సీట్లుండేవి. మేనేజ్‌మెంట్ పరిధిలో ఐదు శాతమే కేటాయించేవారు. యాజమాన్యాల ఒత్తిళ్లకు ప్రభుత్వాలు తలొగ్గి ఈ కోటా సీట్లను 30 శాతానికి పెంచాయి. వీటికి ప్రత్యేకంగా కౌన్సెలింగ్ నిర్వహించి భర్తీ చేయాలని కొన్నేళ్లుగా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నా.. ఫలితం లేదు. ‘‘మేనేజ్‌మెంట్ కోటా సీట్లపై ప్రత్యేకంగా పర్యవేక్షణ ఉండాలి. విద్యార్థులెవరెవరు దరఖాస్తు చేశారు.. ఏ విధంగా సీట్లు కేటాయించారనే విషయాలు బహిర్గతం చేయాలి. ప్రత్యేకంగా కౌన్సెలింగ్ నిర్వహించాలి’’ అని తెలంగాణ సాంకేతిక, వృత్తి విద్యాసంస్థల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వి.బాలకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.
ఎవరు ఎక్కువ చెల్లిస్తే వారికే..ఇంజినీరింగ్ కళాశాలల్లో సీట్లు రెండు రకాలుగా ఉంటాయి. ‘ఏ’ కేటగిరీలో 70 శాతం కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తారు. మిగిలిన 30 శాతం ‘బీ’ కేటగిరీ సీట్లను మేనేజ్‌మెంట్ కోటాలో నింపుకోవచ్చు. సీట్ల భర్తీకి ఉన్నత విద్యామండలి ప్రత్యేకంగా నోటిఫికేషన్ ఇవ్వాలి. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. అప్పుడే కళాశాలలు బ్రాంచ్‌ల వారీగా ఖాళీలు ప్రకటించి భర్తీ చేయాల్సి ఉంటుంది. తొలుత జేఈఈ-మెయిన్ ర్యాంకర్లకు ప్రాధాన్యమివ్వాలి. ఆ తర్వాత ఎంసెట్ ర్యాంకర్లను తీసుకోవాలి. అప్పటికీ సీట్లు మిగిలితే ఇంటర్ మార్కుల ఆధారంగా భర్తీ చేసుకునే వీలుంటుంది. నగర శివారులోని కొన్ని కళాశాలలు మినహా మిగిలినవన్నీ ఎవరు ఎక్కువ డబ్బు చెల్లిస్తే వారికే సీట్లన్నట్లుగా బేరమాడుతున్నాయని తెలుస్తోంది.