తెలంగాణ

telangana

ETV Bharat / state

ముగిసిన రాష్ట్రపతి పోలింగ్​.. కేసీఆర్​ సహా ఓటేసిన 117 మంది ఎమ్మెల్యేలు - presidential election

దేశ ప్రథమ పౌరుడు, 16వ రాష్ట్రపతి పోలింగ్​ ముగిసింది. సీఎం కేసీఆర్​ సహా 117 మంది ఎమ్మెల్యేలు తమ ఓటుహక్కు వినియోగించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఓటింగ్​ బాక్స్​ను ప్రత్యేక భద్రత నడుమ దిల్లీకి పంపనున్నట్లు తెలిపారు.

కొనసాగుతోన్న రాష్ట్రపతి పోలింగ్​.. ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం కేసీఆర్​
కొనసాగుతోన్న రాష్ట్రపతి పోలింగ్​.. ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం కేసీఆర్​

By

Published : Jul 18, 2022, 12:13 PM IST

Updated : Jul 18, 2022, 5:45 PM IST

ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్​ రాష్ట్రంలో ప్రశాంతంగా ముగిసింది. శాసనసభలో ఏర్పాటు చేసిన పోలింగ్​ కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్​ సహా వివిధ పార్టీలకు చెందిన 117 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంత్రి గంగుల కమలాకర్​, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్​ ఓటు వేయలేకపోయారు. వరంగల్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ వచ్చిన సీఎం.. నేరుగా శాసనసభకు వచ్చి ఓటు వేశారు. శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి, ఉప సభాపతి పద్మారావు గౌడ్, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్​రావు, ప్రశాంత్​రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఓటేసేందుకు వస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు

ఉదయం 10 గంటలకు పోలింగ్​ ప్రారంభం కాగా.. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్ అసెంబ్లీకి వచ్చారు. మొదట ఓటు హక్కును కేటీఆర్​ వినియోగించుకున్నారు. అనంతరం మంత్రులు హరీశ్​రావు, జగదీశ్​రెడ్డి, నిరంజన్​రెడ్డి, మహమూద్ అలీ, మల్లారెడ్డి అసెంబ్లీకి వచ్చి ఓటు వేశారు. శ్రీనివాస్​గౌడ్​, పువ్వాడ అజయ్​కుమార్​, ఇంద్రకరణ్​రెడ్డి, కొప్పుల ఈశ్వర్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాఠోడ్, తలసాని శ్రీనివాస్​యాదవ్​ శాసనసభలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ తర్వాత పలువురు ఎమ్మెల్యేలు ఓటు వేశారు.

ఓటు హక్కు వినియోగించుకుంటున్న కేటీఆర్

సీతక్క అయోమయం..: కాంగ్రెస్​కు చెందిన ఎమ్మెల్యేలంతా కలిసి అసెంబ్లీకి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎమ్మెల్యే సీతక్క ఓటు హక్కు వినియోగించుకునే సమయంలో స్వల్ప అయోమయానికి గురయ్యారు. బ్యాలెట్ పత్రంపై ఓటేశాక.. కపార్ట్​మెంట్ వద్ద ఎక్కువ సమయం తీసుకున్నారు. అది గమనించిన కాంగ్రెస్ ఏజెంట్ మహేశ్వర రెడ్డి అనుమానం ఉంటే మరో బ్యాలెట్ పత్రం తీసుకోవాలని సూచించారు. దీంతో మరో బ్యాలెట్ పత్రం ఇవ్వాలని సీతక్క కోరగా.. అధికారులు నిరాకరించారు. దాంతో మొదటి బ్యాలెట్ పత్రాన్నే బ్యాలెట్ బాక్సులో వేసి వెళ్లారు.

ఓటు విలువ 132..: భాజపా, మజ్లిస్ ఎమ్మెల్యేలు శాసనసభకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల సంఘం ప్రత్యేక అనుమతితో ఆంధ్రప్రదేశ్​లోని కందుకూరు ఎమ్మెల్యే మహీధర్​రెడ్డి.. రాష్ట్ర శాసనసభలో ఓటు వేశారు. ఈ ఎన్నికల్లో రాష్ట్ర శాసనసభ్యుల ఓటు విలువ 132. మొత్తం 119 మందికి చెందిన ఓట్ల విలువ 15,708గా ఎన్నికల సంఘం నిర్ణయించింది. ప్రత్యేక భద్రత నడుమ పోలింగ్​ బాక్సును దిల్లీకి పంపనున్నారు.

మాక్​ పోలింగ్​..: అంతకుముందు ఓటింగ్​లో.. పొరపాట్లకు అవకాశం ఉండకూడదన్న ఉద్దేశంతో తెరాస ఎమ్మెల్యేలకు మాక్ పోలింగ్ నిర్వహించారు. పార్టీ ఆదేశాల మేరకు.. మంత్రులు, తెరాస ఎమ్మెల్యేలంతా ఉదయం 8 గంటలకు తెలంగాణ భవన్ చేరుకున్నారు. పోలింగ్ నిబంధనలు, ఓటింగ్ తీరుపై మంత్రులు, ఎమ్మెల్యేలకు కేటీఆర్ వివరించారు. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు అందరూ ఓటు వేయాలని పార్టీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ సూచించారు.

ఓటు వేయని బాలయ్య..: మరోవైపు ఏపీలోనూ రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహా 172 మంది శాసనసభ్యులు అసెంబ్లీ ప్రాంగణంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు బాలకృష్ణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరిలు వ్యక్తిగత కారణాలతో ఓటు వేయలేకపోయారు. వైసీపీ శాసనసభ్యుడు మహీధర్ రెడ్డి హైదరాబాద్​లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తొలి ఓటు వేస్తే.. ఆఖరున గుంటూరు పశ్చిమ శాసనసభ్యుడు మద్దాల గిరి ఓటు వేశారు. రాష్ట్రంలో అధికార, విపక్ష పార్టీలు ద్రౌపదీ ముర్ముకే మద్దతు పలకటంతో ఓటింగ్ ఏకపక్షంగానే సాగింది.

ఇవీ చూడండి..

'వచ్చే 25 ఏళ్ల భవిష్యత్​ను నిర్మించుకోవాల్సిన సమయమిది'

చెరువు మత్తడిపై ఉద్యమ జ్ఞాపకాలు.. గుర్తు చేసుకున్న కేసీఆర్‌

Last Updated : Jul 18, 2022, 5:45 PM IST

ABOUT THE AUTHOR

...view details