టీఎస్‌బీపాస్ ప్రారంభానికి రంగం సిద్ధం భవన నిర్మాణ అనుమతులను మరింత సులభతరం చేసే లక్ష్యంతో ప్రభుత్వం... టీఎస్‌బీపాస్ పేరిట కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. రాష్ట్ర భవననిర్మాణ అనుమతులు, స్వీయ ధ్రువీకరణ విధానం మేరకు 75 చదరపు గజాల్లోపు ఉండే ప్లాట్లలో భవన నిర్మాణాలకు ఎలాంటి అనుమతి అవసరంలేదు. ఒక్క రూపాయి చెల్లించి ఆన్‌లైన్‌లో నమోదుచేసుకుంటే సరిపోతుంది.
21 రోజుల్లో...
100 చదరపు మీటర్ల వరకు ఉండే ప్లాట్లలో గరిష్టంగా 10 మీటర్ల ఎత్తువరకు నిర్మించే భవనాలకు స్వీయధ్రువీకరణ ద్వారా వెంటనే భవన నిర్మాణ అనుమతి లభిస్తుంది. 10 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తుఉండే భవనాలకు నివాసేతర భవనాలకు సింగిల్ విండో విధానంలో దరఖాస్తు చేసిన 21 రోజుల్లో భవన నిర్మాణ అనుమతి మంజూరుచేస్తారు. టీఎస్‌బీపాస్ చట్టం మేరకు 200 చదరపు మీటర్లు అంతకంటే తక్కువ విస్తీర్ణం7 మీటర్ల ఎత్తు వరకు ఉండే భవనాలకు ఎలాంటి తనఖా ఉండదు.
భవన నిర్మాణ అనుమతులతో పాటు లేఅవుట్లు అనుమతులు టీఎస్‌బీపాస్ ద్వారానే పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో లభిస్తాయి. స్వీయ ధ్రువీకరణ ఆధారంగానే ఆన్లైన్లోనే ఆక్యూపెన్సి సర్టిఫికెట్ అందించనున్నారు.
జిల్లా కమిటీ అనుమతి...
రెండున్నర ఎకరాల్లోపు ఉండే లేఅవుట్లకు కలెక్టర్ నేతృత్వంలోని టీఎస్‌బీపాస్ జిల్లా కమిటీ అనుమతి ఇస్తుంది. రెండున్నర ఎకరాలకంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉండే లేఅవుట్లకు పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి నేతృత్వంలోని రాష్ట్ర స్థాయి కమిటీ అనుమతిస్తుంది. 21 రోజుల్లో అనుమతి రాకుంటే వచ్చినట్లే భావించి నిర్మాణం చేపట్టేందుకు కొత్తవిధానంలో అవకాశం కల్పించారు.
స్వీయధ్రువీకరణ...
అనుమతిచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆధ్వర్యంలోని ప్రత్యేక కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించడం సహా దరఖాస్తుదారుడు స్వీయధ్రువీకరణకు ఇచ్చిన సమాచారాన్ని పరిశీలిస్తాయి. తప్పుడు సమాచారం ఇచ్చినా వాస్తవాలను దాచిపెడితే దరఖాస్తుదారుడుని శిక్షించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. అనుమతుల ఉల్లంఘనలకు పాల్పడితే నోటీసు ఇవ్వకుండానే భవనాలు కూల్చేస్తారు.
15 రోజుల్లో చెల్లించే అవకాశం...
భవన నిర్మాణ నిబంధనలు, జోనింగ్ నిబంధనలు, మాస్టర్ ప్లాన్‌ప్రకారం భూవినియోగ నిబంధనలు విరుద్ధంగా ఆమోదం పొందితే అలాంటి వాటిని 21 రోజుల్లోగా రద్దు చేస్తారు. వేర్వేరు పరిమాణాల ఫ్లాట్లకు ప్రామాణిక భవన ప్రణాళికలు టీఎస్‌బీపాస్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. నిర్దేశించిన ఫీజు చెల్లించడానికి 15 రోజులు గడువు ఉంటుంది. 10 శాతం వడ్డీతో మరో 15 రోజుల్లో చెల్లించే అవకాశం ఉంది. అనుమతికి సంబంధించి పురపాలక శాఖ కోరిన సమాచారం ఇచ్చేందుకు 15 రోజుల గడువు ఉంటుంది. అప్పటికి ఇవ్వకుంటే దరఖాస్తును తిరస్కరిస్తారు.
ఇదీ చదవండి:'కరోనా నియంత్రణలో వచ్చే మూడు నెలలు అత్యంత కీలకం'