Crop Damage in Telangana 2023 : రాష్ట్రంలో ఇటీవలి భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న పంటలకు పరిహారం విషయమై అన్ని నివేదికలు వచ్చాక నిర్ణయం తీసుకుంటామని.. నివేదిక రాగానే ముంపు రైతులందరికీ పరిహారం అందిస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. వరదల ధాటికి ఇల్లు కూలిన వారికి గృహలక్ష్మి పథకం కింద ఆర్థిక సాయం చేస్తామని తెలిపారు. కేంద్రం సహాయం చేసినా.. చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ సహాయం కోసం ఎప్పుడూ ఎదురు చూడలేదన్నారు. శాసనసభలో సభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అక్బరుద్దీన్ ఓవైసీ అడిగిన ప్రశ్నలకు మంత్రి ఈ మేరకు సమాధానమిచ్చారు.
వర్షాల కారణంగా పూర్తిగా కూలిన ఇళ్లు 419, పాక్షికంగా కూలిన ఇళ్లు 7500 ఉన్నాయని మంత్రి తెలిపారు. 150 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 770 నివాసాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. ఈ క్రమంలోనే వరదల్లో చిక్కుకున్న 1500 మందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారని వివరించారు. 139 గ్రామాల్లో వరదల నష్టం ఎక్కువజరిగిందన్న ఆయన.. సిబ్బంది కృషి వల్ల ఆస్తి నష్టం, ప్రాణనష్టం భారీగా తగ్గిందన్నారు. ఆపత్కాలంలో రెవెన్యూ, పోలీసు సిబ్బంది కూడా చాలా కృషి చేశారని.. భారీ వరదల్లో ఈదుకుంటూ వెళ్లి విద్యుత్ సిబ్బంది పనులు చేశారని కొనియాడారు. మిషన్ కాకతీయ వల్ల ప్రమాద తీవ్రత తగ్గిందని మంత్రి చెప్పారు.
అన్ని నివేదికలు వచ్చాక పంట నష్టం పరిహారంపై నిర్ణయం తీసుకుంటాం. పూర్తిగా కూలిన ఇళ్లు 419, పాక్షికంగా కూలిన ఇళ్లు 7500 ఉన్నాయి. వరదలకు ఇల్లు కూలిన వారికి గృహలక్ష్మి పథకం కింద ఆర్థిక సాయం చేస్తాం. కేంద్ర ప్రభుత్వ సహాయం కోసం ఎప్పుడూ ఎదురు చూడలేదు. కేంద్రం సహాయం చేసినా.. చేయకపోయినా.. రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. - వేముల ప్రశాంత్‌రెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి
మరోవైపు.. గత మూడేళ్లుగా జీహెచ్‌ఎంసీలో వరదల వల్ల రోడ్లు దెబ్బతిన్నాయని మంత్రి చెప్పారు. వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి వల్ల జీహెచ్‌ఎంసీలోనూ రోడ్ల నష్టం తగ్గుతోందన్నారు. వ్యూహాత్మక నాలాల అభివృద్ధి వల్ల జీహెచ్‌ఎంసీలోనూ నష్టం తగ్గుతోందని..పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌చేపట్టిన చర్యల వల్ల నష్ట తీవ్రత తగ్గుతోందని వివరించారు.