తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రజా పాలనకు నేడు, రేపు తాత్కాలిక విరామం - ఇప్పటి వరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే? - Prajapalana Telangana

Prajapalana Third Day Program in Telangana : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమానికి అశేష ఆదరణ లభిస్తోంది. ఆరు గ్యారెంటీ పథకాల కోసం మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. శనివారం ఒక్క రోజే ఏకంగా 18 లక్షలకు పైగా అర్జీలు అందాయి. గ్రేటర్‌లో అభయహస్తం పథకాల కోసం మూడు రోజుల్లో 10 లక్షల మంది విజ్ఞాపనలు అందించారు. ఇవాళ, రేపు ప్రభుత్వ సెలవుల కారణంగా ప్రజా పాలనకు తాత్కాలిక విరామం లభించింది.

Prajapalana Program in Hyderabad
Prajapalana Third Day Program in Telangana

By ETV Bharat Telangana Team

Published : Dec 31, 2023, 7:14 AM IST

ప్రజాపాలన కార్యక్రమానికి విశేష స్పందన - ఒక్క రోజే ఏకంగా 18 లక్షలకుపైగా అర్జీలు

Prajapalana Third Day Program in Telangana : ప్రజా పాలన కార్యక్రమానికి సాధారణ ప్రజానీకం నుంచి విశేష స్పందన వస్తోంది. ఆరు గ్యారెంటీ పథకాల కోసం మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 40 లక్షల 57 వేల 592 దరఖాస్తులు వచ్చాయి. శనివారం ఒక్క రోజే 18 లక్షల 29 వేల 107 అర్జీలు అందాయి. ఐదు గ్యారెంటీలకు చెందినవి 15 లక్షల 88 వేల 720 కాగా ఇతర అంశాలకు సంబంధించినవి 2 లక్షల 40 వేల 387 ఉన్నాయి. ఇప్పటి వరకు 3 వేల 868 పంచాయతీలు, 8 వేల 697 మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలన సదస్సులు పూర్తయ్యాయని సీఎస్ శాంతికుమారి తెలిపారు. ఇవాళ, రేపు ప్రభుత్వ సెలవుల కారణంగా ప్రజా పాలన సదస్సులకు విరామం ఇచ్చారు. జనవరి 2 నుంచి 6 వరకు తిరిగి సదస్సులు జరగనున్నాయి.

ప్రజాపాలన కార్యక్రమానికి నోడల్‌ అధికారుల నియామకం

Prajapalana Program in Hyderabad: గ్రేటర్‌లో అభయ హస్తం గ్యారంటీలకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. 3 రోజుల్లో దాదాపు 10 లక్షల అర్జీలు అందాయి. ఎల్బీ నగర్ జోన్‌లో 53 వేలు, చార్మినార్‌లో లక్షా 17 వేలు, ఖైరతాబాద్‌లో 74 వేలు, కూకట్‌పల్లిలో 67 వేలు, శేరిలింగంపల్లిలో 38 వేలు, సికింద్రాబాద్‌లో 64 వేలు, కంటోన్మెంట్‌లో 7 వేల దరఖాస్తులు అందాయి. మరోవైపు రేషన్ కార్డుల దరఖాస్తు ఫారం లబ్ధిదారులను గందరగోళానికి గురి చేసింది. మీ సేవా, జిరాక్స్ కేంద్రాల వద్ద నకిలీ దరఖాస్తు ఫారాలు విక్రయిస్తుండటంతో ప్రజలు వాటిని నిజమేనని నమ్మి దరఖాస్తు చేసుకునేందుకు తరలివచ్చారు.

వాటిని పరిశీలించిన సిబ్బంది ప్రభుత్వం రేషన్ కార్డులకు ఎలాంటి దరఖాస్తు ఫారాలు ఇవ్వలేదని, కాగితంపై కుటుంబ వివరాలు రాసి ప్రత్యేకంగా అర్జి పెట్టుకోవాలని సూచించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్‌ రోస్‌ నగరంలోని పలు వార్డు కార్యాలయాల్లో దరఖాస్తుల స్వీకరణను పరిశీలించి సిబ్బందికి తగిన సూచనలు చేశారు. ప్రజలకు ఉచితంగా అభయహస్తం దరఖాస్తు ఫారాలు అందిస్తామని మరోమారు స్పష్టం చేశారు.

'ప్రజా పాలనలో దరఖాస్తుల స్వీకరణకు అవసరమైన ఏర్పాట్లు చేయండి'

Minister Seethakka on Prajapalana in Mulugu: ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రాలో జరిగిన ప్రజాపాలన కార్యక్రమానికి పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి మంత్రి సీతక్క హాజరయ్యారు. గ్యారెంటీ పథకాలపై అవగాహన కల్పించిన మంత్రి అర్హులైన అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తాడ్వాయి మండలం దట్టమైన అడవిలో నివసిస్తున్న గొత్తికోయ గూడానికి స్వయంగా వెళ్లి గిరిజనుల నుంచి సీతక్కదరఖాస్తులను స్వీకరించారు. గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు.

Prajapalana Program in Telangana :ఆర్మూర్ మండలం అంకాపూర్‌లో సదస్సును ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పరిశీలించారు. దరఖాస్తు నింపే విషయంలో అధికారులు ప్రజలకు సహకరించాలని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో తిరుగుతున్న రేషన్‌ కార్డు దరఖాస్తును ప్రజలు నమ్మొద్దని ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ అన్నారు. ప్రభుత్వం రేషన్ కార్డుల కోసం ఇప్పటివరకు ప్రత్యేక దరఖాస్తు విడుదల చేయలేదని తేల్చిచెప్పారు.

Prajapalana Program in Manchirial :మంచిర్యాలలో దరఖాస్తు స్వీకరణ ప్రక్రియను ప్రత్యేక అధికారి ప్రశాంతి పరిశీలించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న ఆమె ఆర్జిదారులకు సహకరించాలని సిబ్బందికి సూచించారు. సూర్యాపేట జిల్లా నడిగూడెంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన ప్రజాపాలనలో తహసిల్దార్‌ హేమమాలిని, గ్రామ కార్యదర్శి శోభన్‌ జనం నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఫారాలను నింపడంలో సాయపడ్డారు. అనంతగిరి మండలం చనుపల్లిలో ఎమ్మార్వో రవికుమార్‌, కార్యదర్శి షరీఫ్‌ పాల్గొన్నారు.

Prajapalana Program in Sangareddy :సంగారెడ్డి జిల్లా పటాన్‌ చెరు మండలం కర్దనూరులో ప్రజాపాలన దరఖాస్తు ఫారాలు ఇంటికి పంపించాలంటూ రేషన్‌ డీలర్‌ హుకూం జారీ చేయడం వివాదానికి దారితీసింది. ప్రజాపాలన సదస్సుకు రాకుండా ఇంటికే దరఖాస్తులు పంపమనడంపై సర్పంచ్‌ భాగ్యలక్ష్మి అభ్యంతరం వ్యక్తం చేశారు. దరఖాస్తులు ఇంటికి పంపలేదనే అక్కసుతో దుర్భాషలాడారని సర్పంచ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన సదస్సులకు జనం బారులు తీరుతున్నారు. 60వేలకు పైగా అర్జీలు అందాయని అధికారులు తెలిపారు.

ప్రజాపాలనకు విశేష స్పందన - దరఖాస్తులకు బారులు తీరిన జనం

నేటి నుంచి ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ - అయిదు పథకాలకు ఒకే అర్జీ

ABOUT THE AUTHOR

...view details