Telangana Decade Celebrations 2023 : తెలంగాణ అవతరణ దినోత్సవాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఊరూరా చెరువుల పండగకు విశేష ఆదరణ లభించింది. తెలంగాణలో నాడు ఎండిన చెరువులు.. నేడు నిండుకుండల్ని తలపిస్తున్నాయని మంత్రి హరీశ్ రావు అన్నారు. నాటి పాలకుల నిర్లక్ష్యంతో గొలుసుకట్టు వ్యవస్థ చిన్నాభిన్నమైందన్న ఆయన.. కేసీఆర్ చేపట్టిన మిషన్ కాకతీయతో చెరువులకు పునర్జీవం వచ్చిందని చెప్పారు. మిషన్ కాకతీయ.. దేశానికే ఆదర్శం అయిందన్నారు. ఈ క్రమంలోనే 'అమృత్ సరోవర్'గా మిషన్ కాకతీయ.. దేశవ్యాప్తంగా అమలవుతుందన్న మంత్రి.. 'తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుందని' పునరుద్ఘాటించారు.
Telangana Formation Day Decade Celebrations 2023 : హైదరాబాద్ రామంతాపూర్ పెద్ద చెరువు వద్ద నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పాల్గొనగా.. అంబర్‌పేటలోని మోహిని చెరువు వద్ద సంబురాలకు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ హాజరయ్యారు. చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని సుర్రం చెరువు వద్ద సంబురాల్లో నీటి పారుదల శాఖ అధికారులు, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు. బంజారాహిల్స్ లోటస్ పాండ్‌లో నిర్వహించిన చెరువుల పండగ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. మహిళలు తలసానికి బతుకమ్మలతో ఘన స్వాగతం పలికారు. చెరువుల పునరుద్ధరణ, చెక్ డ్యాంల నిర్మాణంతో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయని తలసాని పేర్కొన్నారు.
అభివృద్ధిని ఓర్చుకోలేకే విమర్శలు..: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తడ్కోల్‌లో జరిగిన ఊరూరా చెరువుల పండగ కార్యక్రమంలో.. సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. జల వనరుల సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. అభివృద్ధిని ఓర్చుకోలేక కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తున్నారని.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లిలో చెరువుల పండగ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. తెలంగాణ పథకాలను యావత్ రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయని కవిత పేర్కొన్నారు.
జాలర్లకు ఆదాయ మార్గాన్ని చూపాం..: జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో.. చెరువుల పండగ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం గంట్లకుంట గ్రామ సమీపంలో చెరువులో చేపలు పడుతున్న జాలర్లతో కలిసి చేపలు పట్టారు. ప్రభుత్వం చెరువులను నింపి, ఉచితంగా చేపలు వేసి.. జాలర్లకు ఆదాయ మార్గాన్ని చూపించిందని మంత్రి తెలిపారు.