తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆపదలో ఉంటే 100కు డయల్ చేయండి' - awareness programmes on dial 100

దిశ ఘటన నేపథ్యంలో పోలీసు శాఖ మహిళల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఆపద సమయంలో మహిళలు పోలీసులను సంప్రదించే మార్గాలను మరింత సుగమం చేస్తుంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న డయల్ 100 నెంబర్‌ను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ మేరకు విద్యా సంస్థలు, జనసమర్థం అధికంగా ఉన్న ప్రాంతాల్లో.. పోలీసు సిబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గోడ పత్రికల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు.

police women safety actions and awareness programmes on dial 100
'ఆపదలో ఉంటే 100కు డయల్ చేయండి'

By

Published : Jan 3, 2020, 9:05 PM IST

సంచలనం సృష్టించిన దిశ ఘటన అనంతరం మహిళ భద్రతే ప్రశ్నార్థకమైందని పోలీసు శాఖపై విమర్శలొచ్చాయి. జాతీయ రహదారి పక్కనే, టోల్​బూత్ సమీపంలో... 24 గంటలపాటు వాహనాల రాకపోకలు కొనసాగే ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటు చేసుకున్నా.. కనీసం ఎవరూ గమనించకపోవడం సమాజాన్ని విస్తుపోయేలా చేసింది.
అప్రమత్తమైన పోలీసు ఉన్నతాధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఆపదలో ఉన్న మహిళలు వెంటనే పోలీసులను సంప్రదించేలా అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే డయల్ 100 నెంబర్ అందుబాటులో ఉంది. దీనిపై మరింత విస్తృత ప్రచారాన్ని కల్పిస్తున్నారు. పోలీస్ శాఖ తరఫున కానిస్టేబుళ్లు.. విద్యా సంస్థలు, జనసమర్థ ప్రాంతాల వద్దకు వెళ్లి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రధాన కూడళ్ల వద్ద కటౌట్లు, హోర్డింగులు ఏర్పాటు చేస్తున్నారు.
ఐదేళ్లుగా హైదరాబాద్ మహానగర పరిధిలో హాక్-ఐ మొబైల్ అప్లికేషన్ అందుబాటులో ఉంది. ఆపదలో ఉన్న మహిళలు హాక్-ఐ అప్లికేషన్​లోకి వెళ్లి అత్యవసర బటన్ నొక్కితే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్​కు అప్రమత్త సందేశం వెళ్లే విధంగా దీనిని రూపొందించారు. దీంతో సదరు మహిళను ఆపద నుంచి రక్షించే విధంగా రూపకల్పన చేశారు. ఇది అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి.. సుమారు 13లక్షల మంది వినియోగదారులు చరవాణుల్లో డౌన్​లోడ్ చేసుకోగా... దిశ ఘటన అనంతరం నెలరోజుల వ్యవధిలోనే సుమారు 2లక్షల మంది యాప్​ను డౌన్​లోడ్ చేసుకున్నారు.

'ఆపదలో ఉంటే 100కు డయల్ చేయండి'
100 నెంబర్‌కు ఫోన్ వచ్చిన వెంటనే.. కేంద్ర కార్యాలయానికి సంబంధించిన వ్యక్తులు పూర్తి వివరాలు సేకరించి... సంబంధిత పోలీస్ స్టేషన్‌కు సమాచారం చేరవేస్తారు. చిరునామా, వివరాల ఆధారంగా సంఘటనా స్థలానికి చేరుకొని.. తగిన సాయం అందిస్తారు. ఇవి సక్రమంగా జరుగుతున్నాయో లేదో అని తెలుసుకోవడానికి ఉన్నతాధికారులు.. ప్రత్యామ్నాయ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకొని పర్యవేక్షిస్తున్నారు. ఆపదలో ఎవరు ఫోన్​ చేసినా సకాలంలో స్పందిస్తున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 122 పెట్రోల్ కార్లు.. 400కు పైగా బ్లూకోట్స్ సిబ్బంది వెళ్లే ద్విచక్ర వాహనాలున్నాయి. నెలనెలా వీటి పనితీరును సీపీ అంజనీ కుమార్ పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డయల్ 100 నెంబర్ గురించి తెలిసే వరకు... అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. అందరూ పోలీసు సేవలను వినియోగించుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details