భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర వివాదం రాజేశాయి. సోమవారం రాత్రి ఓ వీడియోను చిత్రీకరించిన రాజాసింగ్, తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేశారు. ఇది ఓ వర్గానికి చెందిన ప్రజల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు చేశారంటూ పలు పోలీసుస్టేషన్లలో ఫిర్యాదులు అందాయి. మంగళ్‌హాట్ పోలీసుస్టేషన్‌లో ఖదీర్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు... ఐదు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
153-ఏ, 295-ఏ, 505 (2), 506 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఈ క్రమంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు రాజాసింగ్ ను అరెస్ట్ చేసి నేరుగా బొల్లారం పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం రాజాసింగ్‌ను బొల్లారం పీఎస్ నుంచి నాంపల్లి కోర్టుకి తరలించారు. అక్కడికి రాజాసింగ్ వ్యతిరేక, అనుకూల వర్గాలు తరలిరావడంతో... ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నినాదాలతో కోర్టు పరిసరాలు మారుమోగాయి. ఇరువర్గాలనూ చెదరగొట్టిన పోలీసులు.... పరిస్థితి చేయిదాటకుండా లాఠీఛార్జీ చేశారు. అదనపు బలగాలతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేశారు.